విశ్వక్ సేన్, సితార ఎంటర్టైన్మెంట్స్ ‘VS11’కి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టైటిల్ ఖరారు

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన యువ నటులలో ఒకరిగా విశ్వక్ సేన్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తన 11వ చిత్రం ‘VS11’ కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో చేతులు కలిపారు.

కృష్ణ చైతన్య ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

క్రూరమైన ప్రపంచంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదిగిన వ్యక్తిగా విశ్వక్ సేన్ ఈ చిత్రంలో కనువిందు చేయనున్నారు. ఆయన గ్రే పాత్ర పోషిస్తున్నారని, ఈ సినిమాలో ఆయన నటన ప్రశంసలు అందుకునేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.

ఈ సినిమాలో అంజలి, ‘రత్నమాల’ అనే ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ చిత్రానికి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల నేపథ్యంలో జరిగిన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. 

టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, ఈ మూవీ గ్లింప్స్ ని కూడా విడుదల చేసింది చిత్రబృందం. “మేము గోదారోళ్ళం.. మాట ఒకటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం” అంటూ విశ్వక్ సేన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో గ్లింప్స్ ప్రారంభమైంది. విశ్వక్ సేన్ లుంగీ కట్టుకొని ఊర మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. రాత్రిపూట లారీల్లో అక్రమంగా సరకు తరలించడం, గోదావరి పరిసరాలు, యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన గ్లింప్స్ మెప్పిస్తోంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. 

ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా 2023, డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. 

తారాగణం: విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి

ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్

సినిమాటోగ్రాఫర్: అనిత్ మధాది

ఎడిటర్: నవీన్ నూలి

సహ నిర్మాతలు: వెంకట్ ఉప్పులూరి, గోపీచంద్ ఇన్నమూరి

సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య

రచన, దర్శకత్వం: కృష్ణ చైతన్య

పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్