అభిమానులకు విజయ్ వార్నింగ్.. అలా చేస్తే చర్యలు

తమిళ స్టార్ హీరో విజయ్ తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు. తన పేరుతో ఉన్న పీపుల్స్ మూవ్మెంట్ సంస్థ పేరు, జెండా, తన ఫొటోను రాష్ట్ర, జిల్లా అధికారులు, జిల్లా ఛైర్మన్, నాయకుల అనుమతితోనే ఉపయోగించాలని తెలిపాడు. వారి అనుమతి లేకుండా ఎవరైనా ఉపయోగిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటానని అభిమానులను విజయ్ హెచ్చరించాడు.

విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ భారత కమాండర్ విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ పేరుతో కొత్తగా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించడం గత కొద్దిరోజులుగా తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆ పార్టీతో తనకు అసలు సంబంధమే లేదని, తన అభిమానులు కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేయవద్దని విజయ్ ప్రకటన విడుదల చేయడం కలకలం రేపుతోంది.

విజయ్‌కు చెప్పకుండా చంద్రశేఖర్ పార్టీ పెట్టాడని, అందుకని తండ్రి,కుమారుడి మధ్య విబేధాలు నెలకొన్నాయనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో తన పేరు మీద పీపుల్స్ మూవ్‌మెంట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్లతో తాజాగా తన నివాసంలో విజయ్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.