పొలిటికల్ ఎంట్రీపై హీరో విజయ్ క్లారిటీ

తమిళంతో పాటు తెలుగులోనూ ప్రముఖ తమిళ్ హీరో తలపతి విజయ్‌కి అభిమానులున్నారు. విజయ్ నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ విజయం సాధించాయి. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న విజయ్ త్వరలో ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నాడనే ఊహాగానాలు మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. త్వరలో తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ ఇస్తాడనే వార్తలు ఆసక్తికరంగా మారాయి.

దీంతో ఈ వార్తలపై హీరో విజయ్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు. తన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ ఒక రాజకీయ పార్టీ పెట్టినట్లు మీడియా ద్వారా తనకు తెలిసిందని, ఆ పార్టీతో తనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదన్నాడు. ఆ పార్టీలో చేరాల్సిందిగా అభిమానులకు తాను కోరడం లేదని, తన సామాజిక కార్యక్రమాలకు, ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని విజయ్ చెప్పుకొచ్చాడు.

తన సామాజిక సేవా సంస్థ ‘విజయ్ మక్కల్ లైక్కం’ పేరు మీద కానీ, లేదా తన పేరు మీద ఆ పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా చర్యలకు వెనకాడనని విజయ్ హెచ్చరించాడు. భవిష్యత్తులో తన తండ్రి తీసుకునే నిర్ణయాల వల్ల తాను ప్రభావితం కాబోనని విజయ్ చెప్పాడు.