సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత

సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన సొంతూరు వరంగల్. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడ్డాక తన మకాంను కూడా హైదరాబాద్ కు మార్చారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూనే గురువారం రాత్రి కన్నుమూశారు. అటు మలయాళం, ఇటు తెలుగు సినిమా రంగంలోనూ సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారాయన. తెలుగులో నందమూరి తారక రామారావు, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకూ, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి హీరోల సినిమాలకూ ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచుకున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు జయరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆయన సినిమాటోగ్రఫీలోనే ‘పెళ్లి సందడి’ చిత్రం రూపొందింది. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి..

13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ కుర్రాడు లెజండరీ సినిమాటోగ్రాఫర్ అవుతారని ఎవరైనా ఊహించగలరా? పైగా మలయాళం, తెలుగులో ఆయన మోస్ట్ వాంటెడ్ సినిమాటోగ్రాఫర్ గా పేరుతెచ్చుకున్నారు. ఈ రెండు భాషల్లోని సూపర్ స్టార్ల సినిమాలకు పనిచేసిన అనుభవం ఆయనది. ఆయన సినిమాటోగ్రాఫర్ గా మారిన వైనం కూడా ఓ సినిమాలానే ఉంటుంది. ఆయన పుట్టి పెరిగింది వరంగల్. ఆయన బాబాయికి అక్కడ ఓ ఫొటో స్టూడియో ఉండేది. స్కూలు అయ్యాక రోజూ వెళ్లి ఆ స్టూడియోలో కూర్చోవడం అలవాటుగా మారింది. మహానటుడు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం, పోస్టర్ల మీద ఎన్టీఆర్ ఫొటోలు చూసి మురిసిపోయేవారు. ఆ మహానటుడు నటించిన ఆఖరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’కు జయరామే సినిమాటోగ్రాఫర్. 1960లో ‘ఇల్లరికం’ సినిమా విడుదలైన రోజులవి. ఆ సినిమా చూశాక సినిమాలంటే ఆసక్తి బాగా పెరిగింది. రోజూ వెళ్లి థియేటర్ ముందు కూర్చోవడం జరిగేది. అక్కడ ఉండే సర్దార్జీని బతిమలాడి ఫ్రీగా సినిమా చూసేవారు. అలా 15 సార్లయినా ఆ సినిమా చూశారట. అప్పుడే టైటిల్స్ లో విన్సెంట్ సుందరం పేరు చదివేవారు. ఆయనే ఆ తర్వాత కాలంలో తన గురువు అవుతారని ఊహించలేదు. అలా సినిమాలు ఎక్కువగా చూసేసి ఇంట్లో చెప్పకుండా చెన్నైలో అడుగుపెట్టారు. జేబులో ఐదారు రూపాయలు, వేసుకున్న బట్టలు.. వాటితోనే ప్రయాణం. టిక్కెట్ కొనకుండానే వచ్చిన రైలెక్కేశారు. విజయవాడలో ఆ రైలు ఆగినపుడు అక్కడ దిగేశారు. సరాసరి కృష్ణానదికి వెళ్లి వేసుకున్న బట్టలు ఉతుక్కుని ఇసుక మీద ఆరేసి ఎండిన తర్వాత వేసుకుని కనక దుర్గమ్మ వారి గుడికి వెళ్లారు. నీదయ తల్లీ అని అమ్మవారికి మొక్కి మళ్లీ రైలెక్కి చెన్నై చేరిపోయారు.

సినిమా యాక్టర్లను చూడాలి, సినిమాల్లోకి వెళ్లి ఏదో ఒకటి చేయాలి అన్నదే ఆయన ముందున్నే సంకల్పం. చెన్నైలో స్టేషన్ లో దిగి ఎదురుగా ఉన్న బస్టాండు చేరి అక్కడే కూర్చున్నారు. అక్కడికి టి. నగర్ వచ్చే బస్సు వచ్చింది. బస్సెక్కితే డబ్బులు అడుగుతారని ఆ నంబర్ 11 బస్సు వెనకే నడిచి వెళ్లారు. చాలా బస్సులు టి. నగర్ కు వెళ్తుంటే వాటిని ఫాలో అవుతూ వెళ్లారు. పాండీ బజార్ లో తెలుగు వాళ్లుంటారని అక్కిడికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆంధ్రాక్లబ్ కు చేరుకుంటే దర్శకుడు గుత్తా రామినీడు కనిపిస్తే కలిసి మాట్లాడారు. ‘ఏం చేస్తావ్?’ అంటే ‘నాకేమీ తెలియదు’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఆంధ్రా క్లబ్ కు సెక్రటరీ. మేనేజర్ ని పిలిచి ‘ఇతనికో జాబ్ ఇవ్వు’ అన్నారు. ఆయన ఫ్రెండ్ వి. అంకిరెడ్డి ఎడిటర్. ఎడిటింగ్ రూమ్ కూడా పక్కనే ఉంటుంది. అక్కిడికి వెళ్లి చేసే పనిని అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. జయరాంలోని ఆసక్తి గమనించిన రామినీడు ‘పగలు నీ జాబ్ చేసుకో రాత్రి ఈ వర్క్ నేర్చుకో’ అనేశారు. ఇలా రేయింబవళ్లు పనిచేయడం వల్ల చివరికి జాండిస్ వచ్చింది. కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగి తగ్గించుకున్నారు. అప్పటికే చెన్నై వచ్చి ఏడాది గడిచిపోయింది. ఏదేమైనా ముందుకెళ్లాలిగానీ వెనక్కి వెళ్లకూడదు అనే పట్టుదలతోనే ఉండేవారు. ఆ క్లబ్ లో క్యాషియర్ స్థాయికి ఆయన ఉద్యోగం ఎదిగింది. ఆంధ్రా క్లబ్ లో చిన్న ఉద్యోగం, ఆ తర్వాత అక్కడ క్యాషియర్, అవుట్ డోర్ యూనిట్ నుంచి కెమెరా అసిస్టెంట్, ఆ తర్వాత కెమెరామన్.. ఇలా అంచెలంచెలుగా ఎదిగారాయన.

ఎల్వీ ప్రసాద్ కుమారుడు ఆనంద్ బాబు ప్రోత్సహంతోనే ఆయన అంచెలంచెలుగా ఎదగ గలిగారు. సినిమారంగంలో ఎవరూ గాడ్ ఫాదర్లు లేకపోయినా స్వయంకృషితోనే తను అనుకున్నది సాధించారు. చిన్నప్పటి నుంచి ఆయనకున్న కోరిక అన్ని దేశాలు చూడాలి, ఇండియా అంతా తిరగాలి, అన్నీ ఊళ్లూ చూడాలి అనే కోరిక ఉండేది. అవుట్ డోర్ యూనిట్ లో ఉంటే మనల్ని తీసుకెళతారు అని అనుకునేవారు. అదే సమయంలో ఎల్వీ ప్రసాద్ పెద్ద కుమారుడు ఆనంద్ బాబు ముందు తన కోరికను వ్యక్తం చేశారు. ‘ఏంట్రా ఈ టైమ్ లో నువ్వు అవుట్ డోర్ యూనిట్ లోకి వెళతానంటావ్.. ఆలోచించుకో’ అన్నారు. సరే జనవరి ఒకటో తారీఖున ఉద్యోగంలో చేరమని ఆదేశించారు. అలా అవుట్ డోర్ యూనిట్ లో చోటు దొరికింది.. చీఫ్ కు ఏం కావాలో అవి అందివ్వడమే జయరాం పని. అలా ‘మోసగాళ్లకు మోసగాడు’ అవుట్ డోర్ షూటింగ్. రాజస్థాన్, సిమ్లా, ఎడారుల్లో షూటింగ్.. తన కోరిక నెరవేరిందనుకున్నారాయన. కెమెరా అసిస్టెంట్ గా ఎదగడానికి కూడా ఆనందబాబు ప్రోత్సాహమే కారణం.

జయరాం కెమెరామన్ గా తొలి చిత్రం మెగాస్టార్ చిరంజీవిది కావడం విశేషం. కెమెరా అసిస్టెంట్ గా మొదటి సినిమా కె. బాలచందర్ దర్శకత్వంలో తమిళ సినిమా. కెమెరామన్ గా జయరాం మొదటి సినిమాకి సి.వి. రాజేంద్రన్ దర్శకుడు. ఇందులో హీరో చిరంజీవి. సినిమా పేరు కూడా చిరంజీవే. కైకాల సత్యనారాయణ సోదరుడు కైకాల నాగేశ్వరరావు జయరాంకు స్నేహితుడు. సినిమాటోగ్రాఫర్ గా జయరాం ను పెట్టుకుంటున్నామన్నప్పుడు చిరంజీవి నుంచి ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం కాలేదట. చిరంజీవితో జయరాంకు మొదట్నుంచీ ఉన్న సాన్నిహిత్యం కూడా కొంత కారణం. శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం సినిమాటోగ్రాఫర్ గా ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టింది. వాసు దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగును వారం రోజుల్లో పూర్తిచేయడం విశేషం. ప్రముఖ మలయాళ దర్శకుడు ఐవీ శశి ‘1921’ సినిమాకి మమ్ముట్టి హీరో, సినిమాటోగ్రాఫర్ జయరాం. ఇది పీరియాడికల్ సినిమా. జయరాంకు అవార్డును సంపాదించిపెట్టిన సినిమా ఇది. నటి సౌందర్య ఆఖరి చిత్రం ‘శివశంకర్’కు కూడా ఆయన పనిచేశారు. ఇందులో ఆమె చనిపోయే సన్నివేశాలను కూడా ఆయనే చిత్రీకరించారు. రెండ్రోజుల్లో వస్తానన్న సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడం తనను కలచివేసిందని ఓ ఇంటర్యూలో జయరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను చూడాలన్న మోజుతో సినిమా రంగంలో అడుగుపెట్టి ఆయన నటించిన మంచికి మరోపేరు, డ్రైవర్ రాముడు, వేటగాడు, సింహబలుడు… ఇలా ఎన్నో సినిమాలకు పనిచేశారు. కె. రాఘవేంద్రరావు సినిమాలకూ, మోహన్ బాబు సొంత బ్యానర్ లో నిర్మించిన ఎన్నో చిత్రాలకూ జయరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అలాంటి లెజండరీ సినిమాటోగ్రాఫర్ మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు.