ఈ దగ్గుబాటి అక్కినేని ఫ్యామిలీ హీరోలు కలిసి నటిస్తే వచ్చే కిక్కే వేరు

దగ్గుబాటి మామ అక్కినేని అల్లుడు విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా వెంకీ మామ. చైతన్య నటించిన ప్రేమమ్ సినిమాలో వెంకీ ఒక చిన్న క్యామియో ప్లే చేశాడు. ఈ ఒక్క సీన్ థియేటర్ లో ఫాన్స్ తో విజిల్స్ వేయించింది. అలాంటిది ఫుల్ లెంగ్త్ సినిమాలో కలిసి నటిస్తే ఎలా ఉంటుందో సినిమా నుంచి చిన్న వీడియో బయటకి వచ్చి హింట్ ఇచ్చింది. జై లవ కుశ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన బాబీ డైరెక్ట్ చేస్తున్నఈ సినిమా డిసెంబర్‌ చివరి వారంలో కానీ జనవరిలో కానీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఒకసారి గతంలో మన తెలుగు సినిమాల్లో మామ అల్లుళ్ళు కలిసి నటించిన సినిమాలు ఏం ఉన్నాయి? అవి ఎంత వరకూ ప్రేక్షకులని అలరించాయి అనేది చూద్దాం.

venky mama

మామా అల్లుళ్లు కలిసి నటించిన సినిమాలు అంటే టాలీవుడ్ లో దాదాపు దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ సినిమాలే కనిపిస్తున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది వెంకటేష్ సెకండ్ మూవీ బ్రహ్మరుద్రులు గురించే. ఇందులో నాగేశ్వర రావు వెంకీకి మామగా జడ్జి పాత్రలో కనిపించగా, ఆయన చెల్లి కొడుకుగా వెంకటేశ్ నటించాడు. వెంకటేష్, ఎన్నార్ మధ్య వచ్చే సీన్ బాగుంటాయి. దీని తర్వాత మళ్లీ మామా అల్లుళ్లు కలిసి నటించిన సినిమా స్నేహమంటే ఇదేరా. నిజజీవితంలో బంధువులు అయిన నాగార్జున సుమంత్ ఇందులో స్నేహితులుగా కనిపించారు. 2001లో విడుదలైన స్నేహమంటే ఇదేరా సినిమాలో నాగార్జున, సుమంత్ మధ్య వచ్చే సీన్స్ ఫ్రెండ్షిప్ గొప్పదనం చెప్పేలా ఉంటాయి. మామా అల్లుళ్ల తరహాలో మామాకోడళ్లు నటించిన సినిమా రాజుగారి గది 2. నాగార్జున సమంత కలిసి నటించిన ఈ సినిమాలో ఇద్దరి మధ్య పెద్దగా సీన్స్ లేవు కానీ ఆ మ్యాజిక్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. రాజు గారి గది 2కన్నా ముందే నాగ్, సమంత కలిసి ‘మనం’ మూవీలో నటించినా, అప్పటికి వాళ్లిద్దరూ మామా కోడళ్లు కాలేదు. అయినా వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి.

మామా అల్లుళ్ల కేటగిరితో ఇతర ఫ్యామిలీ మెంబెర్స్ కలిసి నటించిన సినిమాలు కూడా చాలానే వచ్చాయి కానీ మామ అల్లుడు అనగానే తెరపై ఒక మ్యాజిక్ కనిపిస్తూ ఉంటుంది. వెంకీ మామ వీడియోలో కూడా మనం చూసింది అదే, వెంకటేష్ రారా అల్లుడు అనే డైలాగ్ పడగానే ప్రతి దగ్గుబాటి అక్కినేని ఫ్యాన్ రిలేట్ అయ్యి ఉంటాడు. అందుకే ఈ రెండు కుటుంబాల హీరోలు కలిసి నటించిన సినిమా వస్తుంది అంటే అది ఎప్పటికీ అభిమానులకి ప్రత్యేకంగానే నిలబడుతుంది. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న ‘వెంకీ మామ’ మూవీ ఎలా ఆడుతుందో చూడాలి.