మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాస్ సినిమాలకి కెరాఫ్ అడ్రస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నాడు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కమర్షియల్ సినిమాలని మాత్రమే చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ సినిమాలకి దూరమై రాజకీయాలపై పూర్తిగా ద్రుష్టి పెట్టాడు. ఈ అందరికీ పునాది వేసిన మెగాస్టార్ చిరంజీవి, ఆయన స్థాయికి తగ్గ భారీ సినిమాలు చేస్తున్నాడు. చిరు ఏ సినిమా చేసినా ప్రేక్షకులు చూడడానికి రెడీగా ఉంటారు కానీ రెగ్యులర్ గా ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేయడం కష్టమే. చిరునే కాదు మిగిలిన మెగా హీరోలు కూడా ఏడాదికి ఒక సినిమా చేస్తేనే గొప్ప అనే ఫీలింగ్ ఉంది. మరి ఈ పరిస్థితిలో అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించే సినిమాలు చేసే హీరో మెగా ఫ్యామిలీలో లేడా అంటే ఇప్పుడు వినిపిస్తున్న ఒకేఒక్క పేరు వరుణ్ తేజ్.
మెగా ప్రిన్స్ గా పేరున్న ఈ ఆరున్నర అడుగుల బుల్లెట్ ని తెరపైన చూస్తే పెద్దనాన్న చిరంజీవి కనిపిస్తాడు, అతని మాటల్లో బాబాయ్ పవన్ కళ్యాణ్ వినిపిస్తాడు, ఆహార్యంలో తండ్రి నాగబాబుని తలపిస్తాడు. ఈ ముగ్గురి కలయికలా కనిపించే వరుణ్ తేజ్… ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేయగలడు, కుటుంబం అంతా కలిసి కూర్చొని చూడగలిగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయగలడు, యూత్ ని అలరించే కమర్షియల్ సినిమా చేయగలడు, రెగ్యులర్ సినిమాలని ఇష్టపడని వారి కోసం ప్రయోగాలూ చేయగలడు. ఒక పక్క లవర్ బాయ్ సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రయోగాత్మక సినిమాలు చేయడం అంత ఈజీ కాదు.
ఇప్పటి వరకూ హీరోగా ఎన్నో రకాల పాత్రల్లో కనిపించి ప్రేక్షకులని మెప్పించిన వరుణ్ తేజ్, మాస్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన మూవీ వాల్మీకి. ఎక్కువగా క్లాస్ సినిమాలనే చేస్తూ వచ్చిన వరుణ్ తేజ్, మొదటిసారి నెగటివ్ టచ్ ఉన్న రోల్ లో కనిపించడంతో పాటు గద్దలకొండ గణేష్ గా అద్భుతంగా నటించడంతో సాధారణ సినీ అభిమానులు కూడా వరుణ్ పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ యాసలో వన్ లైనర్స్ ని చాలా ఈజీగా చెప్పేసిన వరుణ్, ఎన్నో ఫీలింగ్స్ ని కళ్లతోనే పలికించాడు. ఒకే సినిమాలో వదిలి వెళ్లిపోయిన అమ్మాయి కోసం తపించే లవర్ బాయ్ గా, తల్లి ఒక్క మాట మాట్లాడితే చాలు అని ఎదురు చూసే కొడుకుగా, శత్రువుల వెన్నులో ఒక్క చూపుతో వణుకు పుట్టించగల కిరాతకమైన రౌడీగా కనిపించే అవకాశం దక్కడం అదృష్టం. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పటివరకూ చూడని వరుణ్ తేజ్ ని వాల్మీకీ సినిమాలో చూడొచ్చు. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేము అంటే అతని నటన ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
ఎలాంటి ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుంటే మాత్రమే ఏ హీరో అయినా అలాంటి డేర్ చేయగలడు కానీ వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ హీరో అనే బలమైన, బాధ్యతాయుతమైన బరువుని మోస్తూనే అన్ని రకాల సినిమాలు చేస్తున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తున్నాడు. వరుణ్ తేజ్ సినిమా వస్తుంది అంటే అందులో విషయం ఉంటుంది అనే నమ్మకం ప్రతి తెలుగు సినీ అభిమానికి కలిగించిన ఈ మెగా హీరో, ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ ఫ్యూచర్ లో కూడా సినిమాలు చేస్తే అతితక్కువ కాలంలోనే ఫేస్ ఆఫ్ మెగా ఫ్యామిలీగా ఎదిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కంగ్రాట్స్ వరుణ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాల్మికీ/గద్దలకొండ గణేష్ సక్సస్… ఏ పేరు అయితే ఏముందయ్యా, సినిమా చూసి బయటకి వచ్చే ప్రేక్షకులకి గుర్తుండిపోయేది మాత్రం నువ్వే కదా.