రాధిక నాకు అమ్మ కాదు.. నా అమ్మే నా ధైర్యం: వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ సినిమాలో న‌ట‌న‌తో పాటు ప‌లు విష‌యాల‌పై ముక్కు సూటిగా మాట్లాడి సినీ ప్రేక్ష‌కుల్లో ఎంతో పాపుల‌ర్ అయ్యారు. సందీప్ కిష‌న్ హీరోగా తెర‌కెక్కిన తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది ఈ ఫైర్ బ్రాండ్‌‌. ఇటీవ‌లే ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన క్రాక్ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ జ‌య‌మ్మ అనే కీల‌క పాత్ర‌ల్లో న‌టించింది. ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంతో, ఇక్క‌డి ప్రేక్ష‌కుల్లో జ‌య‌మ్మ‌గా వ‌ర‌ల‌క్ష్మీ ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. కాగా ఆమె మాట‌లు ముక్కు సూటిగా ఉంటాయి.

varalaxmi sharathkumar

ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడేస్తుంటారామే. అస్స‌లు సంకోచించ‌రు. అందుకే ఆమెను విమ‌ర్శించేవారు కూడా ఎక్కువ‌గా ఉంటారు. అలాంటి వాళ్ల‌కు ఆమె ఇచ్చే స‌మాధానం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. కాగా తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యం వెల్ల‌డించింది వ‌ర‌లక్ష్మీ. మీ ఫ్యామిలీ గురించి అంటే.. మీ తండ్రి శ‌ర‌త్‌కుమార్‌, త‌ల్లి అలాగే ప్ర‌ముఖ న‌టి రాధిక గురించి తెల‌పండ‌ని న్యూస్ యాంక‌ర్ అడ‌గ్గా.. దీనికి వ‌ర‌ల‌క్ష్మీ స‌మాధాన‌మిస్తూ.. రాధిక నా త‌ల్లి అని అంటారు. ఆమె నా త‌ల్లి కాదు. నా తండ్రికి రెండో భార్య‌. ఈ విష‌యంలో మేమంతా సంతోషంగానే ఉన్నాం. కానీ బ‌య‌ట బోలెడ‌న్ని పుకార్లు వ‌స్తుంటాయి. రాధిక‌కు నాకు ప‌డ‌ద‌ని అంటుంటారు. కానీ మా ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. నా తండ్రి, రాధిక ఇద్ద‌రినీ నేను స‌మానంగా గౌర‌విస్తాను. వాళ్ల‌కు వ్య‌తిరేకంగా ఏమీ చేయ‌ను అని ఫైర్‌బ్రాండ్ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ తెలిపింది. ఇక త‌న అమ్మ గురించి(శ‌ర‌త్‌కుమార్ మొద‌టి భార్య‌) .. చాలా మంది నువ్వు అంత ధైర్యంగా ఎలా మాట్లాడ‌తావు అంటుంటారు. దానికి స్ఫూర్తి మా అమ్మ ఛాయ‌నే. చిన్న‌ప్ప‌టి నుంచి అమ్మ మాకోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఎలాంటి స‌మ‌స్య ఎదురైన ఒంట‌రిగా పోరాడింది. ఇప్ప‌టికీ ఉత్సాహంగానే ఉంటుంది. నేను అమ్మ‌లో స‌గం అయినా ఉంటే చాల‌నుకుంటాన‌ని వ‌రలక్ష్మీ చెప్పుకొచ్చారు.