సింగర్ మంగ్లి, సీనియర్ నటుడు రఘుబాబు, పాపులర్ ర్యాప్ సింగర్ రోల్ రైడా పాడిన ‘రాం రాం’ పాట

సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై ‘లవర్స్ డే’ ఫేమ్ ఎ.గురురాజ్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం “ఊల్లాల ఊల్లాల”. సత్యప్రకాష్ తనయుడు నటరాజ్ హీరోగా పరిచయమౌతున్నారు. నూరిన్‌, అంకిత‌ కథానాయికలు.తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా “ఊల్లాల ఊల్లాల” చిత్రం లో ‘రాం రాం’ పాట పాడుతూ నటించడమే కాక, హీరోయిన్ నూరిన్ కి డబ్బింగ్ చెప్పింది.’రాం రాం’ అనే ఈ పాటను ప్రముఖ కమెడియన్ రఘు బాబు , పాపులర్ ర్యాప్ సింగర్ రోల్ రైడా కూడా ఆలపించడం విశేషం . ఈ పాట పూర్తి వీడియోను ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ద్వారా హైదరాబాద్ లో రిలీజ్ చేసారు.

ఈ సందర్భంగా సింగర్ మంగ్లి మాట్లాడుతూ, “నిర్మాత గురురాజ్ అన్న తన రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎన్ని కష్టాలు , నష్టాలు పడ్డా చిత్ర పరిశ్రమకి దూరమవ్వకుండా మంచి మంచి చిత్రాలని సుఖీభవ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని ఆయన చాలా ఇష్టంతో నిర్మించారు. ఇందులో నన్ను కూడా భాగం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నపుడు సత్యప్రకాష్ గారిని విలన్ గా చూసి చూసి మొదట్లో సెట్లో భయంగా అనిపించినా ఆయన తెరవెనుక స్వభావం, తెలుగు భాష ఫై పట్టు చూసాక ఆశ్చర్యపోయాను. ఆయన దర్శకత్వం చాలా బాగా చేశారు. ఈ చిత్రంలో ఒక పాట నేను పాడి, ఆ పాటలో నేను నటించాను. నాతో పాటు నటించిన రోల్ రైడా మరియు సంగీతం అందించిన జాయ్, డాన్స్ మాస్టర్ శేఖర్ గారు నాకు చాలా సహకరించారు. రచయిత కాసర్ల శ్యామ్ గారు రాయగా నేను పాడిన పాటలన్ని ఇప్పటివరకు హిట్ అవుతూనే ఉన్నాయి. ఈ పాటతో చిత్రం కూడా అంతే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. ఇందులో హీరోయిన్ నూరిన్ కి నేను డబ్బింగ్ చెప్పాను. ఆ అమ్మాయి చాలా అద్భుతంగా నటించింది. అలాగే హీరో నటరాజ్ఈ చిత్రంలో చాలా ఉత్సాహంగా ఉంటాడు. మొత్తంగా ఈ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది… మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
నిర్మాత ఏ . గురురాజ్ మాట్లాడుతూ “మా చిత్రం జనవరి 1న విడుదల అవుతుంది. కాసర్ల శ్యామ్ మా ప్రతి చిత్రంలో ఒక్క పాట అయినా కచ్చితంగా రాసి తీరుతారు. గమ్మత్తుగా అయన పాడిన పాటే చిత్రానికి హైలైట్ గా మారుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన రాసిన ఇస్మార్ట్ శంకర్ , అలవైకుంఠపురంలో పాటలు ఎలా హిట్ అయ్యాయో, మా ‘రామ్ రామ్’ పాట కూడా అలానే మంచి విజయం సాధిస్తుంది అని అనుకుంటున్నాను. అలాగే సింగర్ మంగ్లి ఈ ప్రత్యేక గీతం పాడింది, నటించింది . అదే విధంగా హీరోయిన్ నూరిన్ కి డబ్బింగ్ కూడా చెప్పింది. మా సంగీత దర్శకుడు జాయ్ మంచి బాణీలు సమకూర్చారు. ఈ సినిమాని మా డైరెక్టర్ సత్య ప్రకాష్ చాల మంచిగా తీర్చిదిద్దారు . అలాగే డాన్స్ మాస్టర్ శేఖర్, ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్ మరియు ఇతర ఆర్టిస్టులు అందరు చాలా బాగా పని చేశారు” అన్నారు.

తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ “నా మిత్రుడు గురురాజ్ కి , చిత్ర సమర్పకురాలు ముత్తమ్మకి ఈ సినిమా మంచి విజయం సాధించడమే గాక మంచి లాభాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా డైరెక్టర్ సత్యప్రకాష్, ఆయన తనయుడు నటరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ జాయ్ మరియు చిత్రానికి పనిచేసిన వారందరికీ మంచి పేరు తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ ” నాలా అవకాశం కోసం ఎదురుచూసే వాళ్ళు ఎందరో ఉన్నా, నాకు మాత్రం గురురాజ్ అనే వ్యక్తి ”సత్య ప్రకాష్ నువ్వు డైరెక్షన్ చెయ్యి” అని అంటూ, నాకేం తెలుసో తెలియదో కూడా అడక్కుండా నన్ను నమ్మి ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు నాకప్పగించారు. మా నిర్మాత గురురాజ్ గారే ఈ చిత్రం అవ్వడానికి కర్త కర్మ క్రియ. ఆయనతో పాటు రామకృష్ణ గౌడ్ గారు కూడా అండగా నిలబడ్డారు. వీరిద్దరి సహకారంతోనే అనుకున్నది సాధ్యమైంది. డిసెంబరు 1 న చిత్రం విడుదలవుతుంది. మంచి చిత్రం తీశామని నమ్మకం మాలో ఉంది ” అని అన్నారు.

రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ ” నిర్మాత గురురాజ్ గారితో నాకు గత 15 సంవత్సరాలుగా, సోదర మిత్ర ఆత్మీయ అనుబంధం ఉంది. చిత్రంలో ఒక ముఖ్యమైన సన్నివేశానికి తగ్గట్టుగా మంగ్లి గారు మరియు రోల్ రైడా గారు పాడే విధంగా ప్రస్తుత సమాజ పరిస్థితులని, సోషల్ మీడియాలో ట్రెండ్ అయినా విషయాలని అలాగే బయటొకలాగా సోషల్ మీడియాలో ఒకలాగా ప్రవర్తించే ఆధునిక పోకడల్ని హాస్యాస్పదంగా మేళవిస్తూ ఒక రాప్ సాంగ్ రాయటం జరిగింది. దానికి తగ్గట్టుగా బాణీలు అందించి మంచి పెప్పీ సాంగ్ గా మలిచారు సంగీత దర్శకుడు జాయ్. సత్య ప్రకాష్ గారి ఆలోచనకి తగ్గట్టుగా ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది ఈ సినిమా ద్వారా సత్య ప్రకాష్ గారి కుమారుడు నటరాజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు, మంచి నటనని కనబరిచాడు. తనకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను ” అన్నారు.

సంగీత దర్శకుడు జాయ్ మాట్లాడుతూ, “సినిమాలకి పనిచేయడం ప్రతి సంగీత దర్శకుడి కల. అది నిజం చేస్తూ, నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు సత్యా ప్రకాష్ గారికి, గురు రాజ్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ పాటకి సహకరించిన మంగ్లీ, రోల్ రైడా, రఘు బాబు గారికి మరియు ముఖ్యంగా కాసర్ల శ్యామ్ గారికి ధన్యవాదాలు” అన్నారు. ఈ చిత్రాన్ని నూతన సంవత్సర కానుక గా జనవరి 1 న విడుదల చేస్తున్నామని చిత్ర సమర్పకురాలు ముత్తమ్మ తెలిపారు. ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ప్రతినిధులు నిరంజన్, మాధవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తారాగ‌ణం:
న‌ట‌రాజ్‌, నూరిన్‌, అంకిత‌, గురురాజ్‌, స‌త్య‌ప్ర‌కాష్‌, `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్‌, పృథ్వీరాజ్‌, `అదుర్స్` ర‌ఘు, జ‌బ‌ర్ధ‌స్త్ న‌వీన్‌, లోబో, మ‌ధు, జ‌బ‌ర్ధ‌స్త్ అప్పారావు, రాజ‌మౌళి, జ్యోతి, గీతాసింగ్‌, జ‌య‌వాణి త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి ఎ.ముత్త‌మ్మ‌
ఛాయాగ్ర‌హ‌ణం: జె.జి.కృష్ణ‌, దీప‌క్‌
సంగీతం: జాయ్‌
ఎడిటింగ్‌: ఉద్ధ‌వ్‌
నృత్య ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ మాస్ట‌ర్‌, దిలీప్ కుమార్‌
యాక్ష‌న్‌: డ్రాగ‌న్ ప్ర‌కాష్‌
ఆర్ట్: కె.ముర‌ళీధ‌ర్‌
పాట‌లు: కాస‌ర్ల శ్యామ్‌, గురుచ‌ర‌ణ్‌
క‌థ – స్క్రీన్ ప్లే-మాటలు- నిర్మాత‌: ఎ.గురురాజ్‌
ద‌ర్శ‌క‌త్వం: స‌త్య‌ప్ర‌కాష్‌.