ఏపీ ప్రభుత్వానికి థ్యాంక్స్ అంటున్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్

తెలుగు సినీ నిర్మాతలు, డైరెక్టర్లు, ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్‌ ఇళ్ల నిర్మాణాలకు, మౌలిక సదుపాయాల కోసం భూమి కేటాయించాలని కోరుతూ గతంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి లేఖ రాసింది. దీనిపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కూడా ప్రత్యేకంగా ఒక లేఖ రాసింది. అయితే ఈ లేఖపై ఎట్టకేలకు గత కొద్దిరోజుల క్రితం ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇళ్ల నిర్మాణం కోసం భూకేటాయింపులు జరపాలని చేసిన ప్రతిపాదనలు తమ దృష్టికి వచ్చాయని, దీనిపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని ఏపీ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇటీవల నిర్మాతల మండలికి రిప్లై ఇచ్చింది.

ఏపీ ప్రభుత్వ సమాధానం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ తాజాగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఒక ప్రకటన జారీ చేసింది. ‘మా అభ్యర్థనలపై ప్రభుత్వం స్పందించడం ఆనందంగా ఉంది. ఇందుకు గాను ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ కుమార్ రెడ్డి, ఛైర్మన్ విజయ్ చందర్‌కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాం. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి కూడా మా ధన్యవాదాలు. సీఎం జగన్ ఆధ్వర్యంలో తెలుగు సినిమా అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. వీలైనంత త్వరగా తమ అభ్యర్థనలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వస్తాయని ఆశిస్తున్నాం’ అంటూ నిర్మాతల మండలి తన ప్రకటనలో తెలిపింది.