క్యాన్సర్‌తో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ కమెడియన్

తన కామెడితో తమిళ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన తవసి కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్‌ నాలుగో స్టేజ్‌లో ఉండటంతో బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. గత కొంతకాలంగా ఒక హాస్పిటల్‌లో తవసి క్యాన్సర్‌కు చికిత్స పొందుతుండగా.. ఆర్థిక పరిస్థితుల వల్ల చికిత్స చేయించుకోవడానికి ఆయన దగ్గర డబ్బులు లేని పరిస్థితి. దీంతో తన నాన్నకు చికిత్స చేయించడానికి ఆర్థిక సాయం చేయాలంటూ తవసి కుమారుడు అరుముగన్ కోలీవుడ్‌ సెలబ్రెటీలను కోరాడు.

దీంతో తమిళ స్టార్‌ హీరోలైన విజయ్‌ సేతుపతి, శివకార్తికేయన్‌, సూరిలతో పాటు పలువురు ప్రముఖులు ఆర్థికసాయం అందిస్తున్నారు.  హీరో శివకార్తికేయన్‌ అయితే తన ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ద్వారా రూ. 25వేల చెక్‌ను తవసి కుటుంబానికి అందించాడు. ఇక విజయ్‌ సేతుపతి, తన స్నేహితుడైన సుందర్‌ రాజ్‌తో  కలిసి రూ.లక్ష విరాళం ఇచ్చాడు. ఇక సుందర్‌ రాజ్‌ రూ.10 వేలు ఇవ్వగా.. నటుడు సూరి నిత్యవసర సరుకులు అందించారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ శరవణన్‌ ఇప్పటికే తవసి వైద్య ఖర్చులను చూసుకున్నట్లు సమాచారం.   ప్రస్తుతం ఆహారం తీసుకోవడానికి కూడా తవసి ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్లు అయనకు పైపు ద్వారా పళ్ల రసాలను ఇస్తున్నారు.