ట్రెండీ ఎంటర్టైనర్ గా “తకిట తధిమి తందాన”

“మర్డర్” ఫేమ్ ఘన ఆదిత్య – అచ్చ తెలుగమ్మాయి ప్రియ జంటగా.. రాజ్ లోహిత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తాను నిర్మాతగా అరంగేట్రం చేస్తూ… ఎల్లో మ్యాంగో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై.. “చందన్ కుమార్ కొప్పుల” నిర్మించిన “తకిట తదిమి తందాన” చిత్రం రేపు (ఫిబ్రవరి 27) ప్రేక్షకుల ముందుకు రానుంది. సినెటేరియా మీడియా వర్క్స్ ఆధ్వర్యంలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత చందన్ కుమార్ కొప్పుల మాట్లాడుతూ… “నేను స్వతహా సినిమా పిచ్చోడ్ని. ఇంచుమించుగా అన్ని సినిమాలు చూస్తుంటాను. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ టైమ్ లో నేను చూసిన కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ నన్ను విపరీతంగా ఇంప్రెస్ చేశాయి. అలాంటి చెరగని ముద్ర వేసే సినిమా చేయాలనే సంకల్పంతో నిర్మాతగా మారాను. ఆ క్రమంలో రాజ్ లోహిత్ పరిచయం కావడం, తను చెప్పిన కథతో నేను కనెక్ట్ కావడంతో రంగంలోకి దిగాను. ఫస్ట్ కట్ చూసుకున్నాక చాలా హ్యాపీ అనిపించింది” అన్నారు. “తకిట తధిమి తందాన” రాజ్ లోహిత్ ప్రతిభకు అద్దం పడుతుందని, జల్సాల కోసం అప్పులు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వినోదాత్మకంగా చెప్పామని” చందన్ తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ… సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన తాను విజయవంతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుండడంతో తన కుటుంబ సభ్యుల మోరల్ సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెబుతూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. “తకిట తధిమి తందాన” చిత్రాన్ని విడుదల చేయడంలో సినేటేరియా వెంకట్ సహకారం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పిన ఈ నూతన నిర్మాత… హరి శంకర్ ఎడిటింగ్, నరేన్ రెడ్డి మ్యూజిక్, రాజ్ లోహిత్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణలని పేర్కొన్నారు. హీరో ఘన ఆదిత్య, తెలుగమ్మాయి ప్రియలకు ఉజ్వల భవిష్యత్ ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.