Tag: Revanth Korukonda
‘ఇండియన్ పనోరమా’ కు ఎంపికైన ఒకే ఒక తెలుగు సినిమా ‘నాట్యం’!!
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై నిర్మించిన చిత్రం నాట్యం. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 22న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకున్నది. ఈ నెల 20 న గోవాలో ప్రారంభం అవుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి)లో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా దర్శకుడు రేవంత్ కోరుకొండ మాట్లాడుతూ: గోవాలో జరుగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి) ఎంపికైన ఏకైక తెలుగు సినిమాగా నాట్యం నిలవడం గర్వంగా ఉంది.భారతీయ, తెలుగు సంస్కృతి గొప్పతనం, అందం గురించి అందరూ మాట్లాడుకోవాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశాం. కొత్తదనాన్ని ప్రేక్షకులకు పంచాలని భావించాం. ఆ ఘనతను సాధించామనిపిస్తుంది. ఇండియన్ పనోరమకు వివిధ భాషల నుంచి ఇరవై ఐదు సినిమాలు ఎంపికకాగా వాటిలో నాట్యం ఒకటిగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నా. అందరూ గర్వపడే తెలుగు సినిమా ఇది. సంధ్యారాజుతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ సమిష్టిగా కష్టపడి ఈ సినిమా చేశాం. ఏడాదిన్నర శ్రమకు ప్రతిఫలం దక్కంది. బాలకృష్ణ, చిరంజీవి, రామ్‌చరణ్ కె విశ్వనాథ్‌తో పాటు ఇండస్ట్రీలోని చాలా మంది సినీ ప్రముఖులు సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి సహాయపడ్డారు. త్వరలో ఈ సినిమాను ఓటీటీలో విడుదలచేయబోతున్నాం అని తెలిపారు.
కమల్ కామరాజు మాట్లాడుతూ:చక్కటి కళాత్మక చిత్రంగా నాట్యం విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది. ఓ సినిమా షూటింగ్ కోసం జబల్పూర్ వెళ్లాను. అక్కడ కూడా ఈ సినిమా బాగుందని చాలా మంది చెప్పడం సంతోషాన్ని కలిగించింది. నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా ఇది. తెలుగు సంస్కృతులు సంప్రదాయాల విశిష్టతను చాటిచెబుతూ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, భారీ బడ్జెట్‌తో సంధ్యారాజు ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మంచి సినిమాలో నేను భాగం కావడం గర్వంగా అనిపిస్తుంది అని తెలిపారు.
సంధ్యారాజు మాట్లాడుతూ: కుటుంబ వ్యాపారాలు, డ్యాన్స్‌ను వదిలిపెట్టి సినిమా చేయడం అవసరమా అని చాలా మంది విమర్శించారు. నేను ఎన్ని సమాధానాలు చెప్పిన వారు సంతృప్తిగా ఫీలవ్వలేదు. అలాంటివారందరికి ఇఫికి ఈ సినిమా ఎంపికకావడమే పెద్ద సమాధానంగా భావిస్తున్నా. తెలుగు నాట్యకళలకు మరింతగా ఈ సినిమా గుర్తింపును తీసుకొస్తుందని నమ్ముతున్నా అని చెప్పింది.
విరోధి, గతం తర్వాత ఇండియన్ పనోరమకు ఎంపికైన తెలుగు సినిమాగా నాట్యం నిలిచిందని, మంచి సినిమాలు తెలుగులో వస్తాయని నిరూపించిందని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ వడ్లపట్ల పాల్గొన్నారు.