ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రతికుంటే ఇట్టే ఉండేవాడా సామీ?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా సైరా, మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సైరా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 2నే సైరా రిలీజ్ కాబోతోంది, ప్రొమోషన్స్ అనుకున్న స్థాయిలో జరగట్లేదని అభిమానులు అనుకుంటున్న టైములో సైరా ట్రైలర్ రిలీజ్ అయ్యి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని నేరుగా చూడని వారు, ట్రైలర్ లో చిరంజీవిని చూస్తే ఆ వీరుడు ఇలానే ఉండి ఉంటాడా? అతని గొంతు అంతే గంభీరంగా ఉండేదా? ఆ కళ్లలో వేడి అలానే ఉండేదా? అతను కదులుతుంటే ఒక యుద్ధమే కదిలినట్లు అనిపించేదా? అంటే నిజమే అనిపించేలా ఉంది. చిరంజీవిని చూస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకి అతని కోసమే పుట్టిందా అనిపించింది. మూడు నిమిషాల నిడివితో విడుదల చేసిన సైరా ట్రైలర్, అమితాబ్ గొంతుతో మొదలయ్యింది.. సైరాని పట్టుకోవడం కష్టం అనే డైలాగ్ తో జరిగిన ఇంట్రో మెగాస్టార్ ని మరో స్థాయిలో చూపించింది. ముఖ్యంగా ట్రైలర్ మొదలైన పది పదిహేను సెకండ్స్ లోనే వినిపించే అనుష్క గొంతుతో అతనొక యోగి అని చెప్తుంటే వచ్చే విజువల్ అద్భుతం. యుద్దానికి సిద్ధమయ్యే ముందు ఉండే ప్రశాంతతని చూపిస్తున్నట్లు శివలింగం ముందు చిరంజీవి కూర్చున్న సీన్ నిజంగా అద్భుతమే.

ఆ తర్వాత ట్రైలర్ లో వరసగా వచ్చిన స్టంట్స్ చాలా బాగున్నాయి. ఉయ్యాలవాడ ప్రేమికురాలు లక్ష్మిగా కనిపించిన తమన్నా అప్పీరెన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. వైట్ డ్రెస్ తమన్నా వీర వనితలా ఉంది. నరసింహారెడ్డి భార్యగా కనిపించిన నయన్ చాలా హుందాగా ఉంది. రేనాటి సూర్యుడి గురువు పాత్రలో అమితాబ్, చిరుకి ఇచ్చిన ఎలివేషన్స్ పీక్ స్టేజ్ లో ఉన్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి యుద్ధ సహచరులుగా కనిపించిన సుదీప్, విజయ్ సేతుపతి పోరాటానికి కొత్త ఊపిరి పోశారు. ముఖ్యంగా విజయ్ సేతుపతిని ఇంట్రడ్యూస్ చేసిన సీన్ గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. ఒక్క విజయ్ సేతుపతి సీన్ మాత్రమే కాదు ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. కేవలం వార్ సినిమాగానే కనిపించకుండా సైరాలో అద్భుతమైన కథ ఉంది, ఒక వీరుడి పోరాటం ఉంది, దేశం కోసం జరిగిన మొదటి తిరుగుబాటు ఉంది. అందుకే సైరా మిగిలిన భారీ బడ్జట్ సినిమాలన్నా ప్రత్యేకంగా నిలిచింది.

ఇప్పటి వరకూ కమర్షియల్ కథలని మాత్రమే తీసిన సురేందర్ రెడ్డి, 250 కోట్ల బడ్జట్ కి పూర్తిగా న్యాయం చేశాడు. అంత పెద్ద సినిమాని సురేందర్ రెడ్డి సూపర్బ్ గా హ్యాండిల్ చేశాడు. ఇక ప్రొడ్యూసర్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సైరా ప్రొడక్షన్ వాల్యూస్ ఈ స్థాయిలో ఉన్నాయి అంటే దానికి ప్రధాన కారణం రామ్ చరణే. తండ్రిని వీరుడిగా చూపించే క్రమంలో, తండ్రి కలని నెరేవేర్చే ప్రాసెస్ లో చరణ్ డబ్బుల గురించి ఆలోచించలేదు. సినిమా అవసరమైనది, సినిమాకి కావాల్సింది ఎంత కష్టమైనా, ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా పెట్టాడు. సింపుల్ గా చెప్పాలి అంటే సైరా సినిమాకి కేవలం డబ్బులు మాత్రమే కాదు నాన్న చిరంజీవి కోసం చరణ్ తన ప్రాణమే పెట్టాడు. చరణ్ లాంటి కొడుకు ఉంటే ఏ తండ్రి అయినా గర్వపడతాడు.

కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి సౌండ్ వరకు 24 క్రాఫ్టులు సైరా కోసం ప్రాణం పెట్టి పని చేశారనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ట్రైలర్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పార్థి సీన్ ని పీక్ స్టేజ్ లో ఎలివేట్ చేసింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ సైరా సినిమాకి మరో అస్సెట్ అయ్యింది. సైరా ట్రైలర్ లో చూపించిన మరో ముఖ్యమైన విషయం, క్లైమాక్స్ ని రివీల్ చేయడం. చరిత్ర ప్రకారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరివేసి చంపారు, సినిమాలో అది చూపిస్తారా లేదా అనే అనుమానం అందరికీ ఉండేది. ట్రైలర్ లో ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పేసింది. చరిత్రని ఏమాత్రం మార్చకుండా సైరా సినిమా క్లైమాక్స్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరివేసి చంపే సీన్ ని యధావిథిగా పెట్టారు. ఈ ప్రాసెస్ లో వచ్చే సీన్ ప్రీ క్లైమాక్స్ నుంచి పీక్ స్టేజ్ కి వెళ్లనున్నాయి, హై ఎమోషనల్ నోట్ లో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకి వస్తారు అనడంలో సందేహం లేదు. అప్పటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లదొరలపై పోరాటం చేస్తే అక్టోబర్ 2న ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇండియన్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయనున్నాడు. ఆ దాటి ఎలా ఉంటుందో తెలియాలి అంటే శాంపిల్ గా సైరా ట్రైలర్ చూడండి చాలు.