ఇలాంటి ఫ్యాన్స్ ఉంటే ఏ హీరోకైనా గర్వంగా ఉంటుంది

ఒక స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే భారీ ఫ్లెక్సీలు, అంతకు మించిన బ్యానర్లు రోడ్ల నిండా దర్శనమిస్తుంటాయి. ఏ హీరోకి ఎంత పెద్ద ఫ్లెక్సీ ఉంటే అంత గొప్ప అని అభిమానులు ఫీల్ అయ్యే పరిస్థితిలో కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, సూర్యలు తమ సినిమాలకి ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టొద్దని అభిమానులని కోరారు. స్టార్ హీరోలు మంచి పని చేశారు కానీ ఇందంతా ఎందుకు అనుకుంటున్నారా? రీసెంట్ గా సౌత్ చెన్నైలోని పల్లికరనైలో రోడ్డుపై ఫ్లెక్సీ కూలడంతో జరిగిన ప్రమాదంలో శుభశ్రీ అనే 23 ఏళ్ల ఐటీ కంపెనీ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటన తమిళ సమాజంతో పాటు తమిళ సినీ పరిశ్రమలో కూడా కదలిక తెచ్చింది. ముందుగా ఈ విషయంపై స్పందించిన సూర్య, ఇలాంటి ఇన్సిడెంట్ మరొకటి జరగకూడదని ఈ నెల 20న కాప్పన్ విడుదల సందర్బంగా అభిమానులు ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, ఒకవేళ చేయాలనుకుంటే ఏవైనా సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. సూర్య రిక్వెస్ట్ కి చాలా హ్యాపీగా ఫీల్ అయిన అతని ఫ్యాన్స్, బ్యానర్లు ఫ్లెక్సీలకి ఖర్చు అయ్యే డబ్బులతో హెల్మెట్లు కొని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. సూర్య తీసుకున్న ఈ నిర్ణయం నిజంగానే చాలా గొప్పది, అతని బాటలోనే నడుస్తూ ఇలయదళపతి విజయ్ కూడా అతని ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేశాడు. ఇదే దారిలో నడుస్తూ ఇంకెంత మంది హీరోలు తమ ఫ్యాన్స్ కి ఇలాంటి సందేశం ఇస్తారో చూడాలి.