పూజా కార్యక్రమాలతో ‘సూర్య 46’ చిత్ర ప్రారంభం

విభిన్న చిత్రాలు, పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. తెలుగులోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రం కోసం ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య చేతులు కలిపారు. కేవలం ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది సూర్య నటిస్తున్న 46వ చిత్రం. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.33 గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. నేడు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

ఈ తరంలో అత్యంత ప్రతిభగల దర్శకులలో ఒకరిగా వెంకీ అట్లూరి పేరు తెచ్చుకున్నారు. భావోద్వేగ లోతును, వాణిజ్య విలువలను చక్కగా మిళితం చేసే కథకులలో వెంకీ అట్లూరి ఒకరు. సార్/వాతి, లక్కీ భాస్కర్ వంటి అద్భుతమైన సినిమాలతో వరుస ఘన విజయాలను సొంతం చేసుకొని ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు మరో అద్భుతమైన కథతో అలరించడానికి సూర్యతో చేతులు కలిపారు.

తెలుగునాట సూర్యకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కెరీర్ ను మలుపుతిప్పిన ‘గజిని’ సినిమా నుంచి భారీస్థాయిలో అభిమానులను ఏర్పరచుకున్నారు. పాత్రలు, కథల ఎంపికలో వైవిధ్యం చూపించే సూర్య.. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తదనం అందిస్తూనే ఉంటారు. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న తన 46వ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి సన్నద్ధమవుతున్నారు.

ప్రేమలు చిత్రంతో యువతకు చేరువైన యువ సంచలనం మమిత బైజు కథానాయికగా నటిస్తుండటం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. ఈ చిత్రంతో రవీనా టాండన్ తెలుగు సినిమాల్లోకి పునఃప్రవేశం చేస్తున్నారు. సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇటీవల సార్, లక్కీ భాస్కర్, అమరన్, వీర ధీర సూరన్ చిత్రాలకు ఆకట్టుకునే సంగీతాన్ని అందించి విలక్షణమైన సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు జి.వి. ప్రకాష్ కుమార్. ఇప్పుడు వెంకీ అట్లూరితో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. వెంకీ అట్లూరి గత చిత్రాలు సార్, లక్కీ భాస్కర్ విజయాల్లో జి.వి. ప్రకాష్ సంగీతం కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రాబోయే సూర్య చిత్రంలో భావోద్వేగం మరియు మాస్ అప్పీల్‌ను మిళితం చేసే సౌండ్‌ట్రాక్‌తో ఆ ట్రెండ్‌ను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. అద్భుతమైన విజువల్స్ కు పేరుగాంచిన నిమిష్ రవి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఎడిటర్ గా జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి, కళా దర్శకుడిగా బంగ్లాన్ వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులు మెచ్చే చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. భారీ అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

తారాగణం: సూర్య, మమిత బైజు, రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: నిమిష్ రవి
కూర్పు: నవీన్ నూలి
కళా దర్శకుడు: బంగ్లాన్
ఫైట్ మాస్టర్: వి. వెంకట్
కొరియోగ్రాఫర్: విజయ్ బిన్నీ
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యలమంచిలి గోపాలకృష్ణ
లైన్ ప్రొడ్యూసర్: ఉమామహేశ్వరరావు
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్