చెన్నై చేరిన తలైవా… వారంలో అమెరికా ప్రయాణం?

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమా చేస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ 35 రోజుల పాటు హైదరాబాద్ లో జరిగింది. సోమవారం సాయంత్రంతో రజినీ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తవడంతో, మంగళవారం ఆయన చెన్నై వెళ్లారు. రజనీకాంత్‌ పార్ట్ షూట్ ఈ షెడ్యూల్ తో కంప్లీట్ అయ్యిందని చిత్ర యూనిట్ సమాచారం. ఇక నయనతారతో పాటు ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందట.

తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించినప్పటికీ, నిబంధలను పాటిస్తూనే అన్నాత్తే యూనిట్ షూటింగ్ చేశారు. ఈరోజు నుంచి కంప్లీట్ లాక్ డౌన్ వేయడంతో మిగిలిన షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. పది రోజుల లాక్ డౌన్ అయ్యాక మళ్లీ హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తారా లేక చెన్నై లోనే సెట్ వేసి కంప్లీట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ వారంలో అన్నాత్తె డబ్బింగ్ పూర్తి చేసిన తర్వాత రజనీకాంత్ మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్లనున్నారు.