అన్నాడీఎంకే పార్టీకే నా మ‌ద్ద‌తు: సుమ‌న్‌‌

దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌తో పోల్చుకుంటే త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు పూర్తి భిన్నంగా ఉంటాయ‌నే విష‌యం తెలిసిందే. జాతీయ పార్టీల ప్ర‌భావం పెద్ద‌గా లేకుండా.. పూర్తిగా ప్రాంతీయ.. అది కూడా ద్ర‌విడ సంస్కృతికి ప్రాధాన్య‌మిచ్చే అంశాల చుట్టూ అక్క‌డి రాజ‌కీయాలు తిరుగుతుంటాయి.. ఇక ఈ ఏడాది మార్చిలో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో హ‌డావుడి పెరుగుతోంది. అన్ని రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టికే పూర్తి స్థాయిలో ఎన్నిక‌ల‌పై దృష్టిని సారించాయి.

suman about anna dmk party

ఇక సినీ ప్ర‌ముఖులు కూడా ఎదో ఒక పార్టీకి మ‌ద్ద‌తు ప‌లుకుతూ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు గ్లామ‌ర్ అద్దుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ న‌టుడు సుమ‌న్ అన్నా డీఎంకేకు మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. సినీ ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చి 43ఏళ్లు నిండిన సంద‌ర్భంగా మ‌ధుర మీనాక్షి అమ్మ‌వారిని సుమ‌న్ ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప‌లు రాష్ట్రాల్లో దివంగ‌త జ‌య‌ల‌లిత ప్రారంభించిన అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాయ‌ని తెలిపారు. దీంతో ఆమెను త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ఆరుసార్లు ముఖ్య‌మంత్రిని చేశార‌ని అన్నారు. ఆ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తూ, త‌మిళ‌నాడు రాష్ట్రాన్ని అభివృద్ధికి పాటు ప‌డుతున్న సీఎం ప‌ళ‌నిస్వామి అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నార‌ని, సీఎం ప‌ద‌వి దేవుడిచ్చిన వ‌ర‌మ‌ని.. అంద‌రికీ ఆ బాగ్యం ద‌క్క‌ద‌ని సుమ‌న్ అన్నారు. అదేవిధంగా రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడు ప్ర‌జ‌లంద‌రూ అన్నా డీఎంకేకు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని, మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేలా ఆశీర్వ‌దించాల‌ని త‌మిళ ప్ర‌జ‌ల‌ను సుమ‌న్ కోరారు.