

మహాశివరాత్రి మహాలింగోద్భవ పవిత్ర ఘట్టం ముగిసి మూడురోజులైనా …ఈ అపురూప పవిత్ర అభిషేక ఘట్టం తన జీవన యానంలో ఒక అందమైన పవిత్ర జ్ఞాపకంగా మిగులుతుందని ప్రముఖ తెలుగు యాంకర్ సుమ కనకాల పేర్కొన్నారు.
ప్రముఖ సినీ నిర్మాత , వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి అతి అరుదైన కృష్ణ శిలలతో బళ్లారిలో కోట్లాది రూపాయలతో నిర్మించిన ‘ శ్రీ అమృతేశ్వర ఆలయం’ లో ఈ మహాశివరాత్రి పర్వదిన వేళ గర్భగుడిలో వేదవేత్తల మంత్రధ్వనుల మధ్య తాను స్వయంగా మహాస్పటికలింగాని కి అభిషేకం చేసుకోవడం ఎంతో తన్మయత్వానికి గురిచేసిందని సుమ చెప్పారు.
అఖండమైన ఈ అభిషేకానంతరం ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ … అడుగడుగునా, అనుభూతిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ అమోఘమైన శ్రీ అమృతేశ్వర ఆలయ నిర్మాణ సమయంలో సాయి కొర్రపాటి ఎన్నో కష్టాలని కటాక్షాలుగా మార్చుకుని నిస్వార్ధ సేవగా అంకితం చేయడం వల్లనే శివ భక్తుల పాలిట కల్పవృక్షమై తరాలపాటు చెప్పుకునేలా ఈ ఆలయం వరాలు వర్షిస్తోందని చెప్పారు.


ఆలయ ఫౌండర్ ట్రస్టీలు సాయి కొర్రపాటి , శ్రీమతి రజని కొర్రపాటి సమర్ధవంతమైన పర్యవేక్షణలో లక్షలాది భక్తుల మధ్య జరిగిన శివరాత్రి మహా సంరంభ కార్యక్రమంలో బళ్ళారి సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ శోభారాణి, హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య , మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు , బెంగళూరు , బళ్లారి కి చెందిన పలువురు సినీ రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు ప్రముఖులు పాల్గొన్నారు. శంకర పీఠాధిపతి సచ్చిదానంద స్వామీజీ పర్యవేక్షణలో లింగోద్భవ కాలంలో శ్రీ అమృతేశ్వర మహా స్ఫటికలింగానికి వివిధ వైదిక ఉపచారాలతో జరిగిన అభిషేకార్చనలు చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.
గత సంవత్సరం మాఘమాసంలోనే ప్రారంభించబడిన ఈ శ్రీ అమృతేశ్వర ఆలయ ప్రారంభ వేడుకలో సాయి కొర్రపాటి సన్నిహితులు, దర్శక ధీరులు ఎస్. ఎస్. రాజమౌళి, శ్రీమతి రమా రాజమౌళి , విఖ్యాత సంగీత దర్శకులు ఎం. ఎం. కీరవాణి , శ్రీమతి శ్రీవల్లి, కేజీఎఫ్ హీరో యశ్ , విఖ్యాత జానపద గాయని మంగ్లీ, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం భక్త బృందాలకు సాయి కొర్రపాటి చేసిన అద్భుతమైన ఏర్పాట్లకు వేలకొలది భక్తులు ప్రశంసలు కురిపించడం గమనార్హం.