ఎస్‌.ఎస్‌.కార్తికేయ‌ నిర్మిస్తున్న ‘ఆకాశ‌వాణి’ చిత్రీక‌ర‌ణ 90 శాతం పూర్తి

Aakashavani

తొలిసారి ఎస్‌.ఎస్‌.కార్తికేయ‌, అశ్విన్ గంగ‌రాజు, కాల‌భైర‌వ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న వైవిధ్య‌మైన క‌థా చిత్రం `ఆకాశ‌వాణి `. ఓ రేడియో చుట్టూ ద‌ట్ట‌మైన అడ‌విలో జ‌రిగే ఆస‌క్తిక‌ర‌మైన చిత్ర‌మిది. పాడేరు అట‌వీ ప్రాంతంలో వేసిన భారీ సెట్‌తో పాటు ఇత‌ర లొకేష‌న్స్‌లో ఇప్ప‌టికే 90 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. షోయింగ్ బిజినెస్ బ్యాన‌ర్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అశ్విన్ గంగ‌రాజు మాట్లాడుతూ “పాడేరు ప్రాంతంలో దాదాపు 50 రోజుల పాటు ఏక‌ధాటిగా జ‌రిగిన షెడ్యూల్‌ను ఛాలెంజింగ్ సిట్యువేష‌న్స్‌లో చిత్రీక‌రించారు. ఈ షెడ్యూల్ చాలా అడ్వెంచ‌ర‌స్‌గా అనిపించింది. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేశాం. 90 శాతం సినిమా పూర్త‌య్యింది. 10 శాతం మాత్ర‌మే చిత్రీక‌రించాల్సిఉంది“ అన్నారు.

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి `ఈగ‌` చిత్రానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు.. త‌దుప‌రి రాజ‌మౌళి బాహుబ‌లి సిరీస్‌కు అసిస్టెంట్ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశారు. ఇప్పుడు `ఆకాశ‌వాణి` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అలాగే కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీత ద‌ర్శ‌కుడిగా.. రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ ఈ చిత్రంతో నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు.

ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ను పోషించారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.