రాజరాజచోర క్రియేటివ్ అనౌన్స్మెంట్

ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో శ్రీవిష్ణు. తాజాగా ఈ యంగ్‌ హీరో నటిస్తున్న మరో విభిన్నమైన చిత్రం ‘రాజ రాజ చోర’.  మేఘా ఆకాశ్‌ – సునయన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఎంటర్టైనర్‌ ని హసిత్‌ గోలి తెరకెక్కిస్తున్నాడు. టైటిల్‌ తోనే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసిన మేకర్స్‌.. ప్రచార చిత్రాల్లో చోర (దొంగ) అనే కొత్త అవతారంలో శ్రీవిష్ణు ను చూపించి సినిమాపై అంచనాలను పెంచారు. ’రాజ రాజ చోర’ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్‌ – అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. దీనికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా.. కీర్తి చౌదరి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి  సరికొత్త ప్రమోషనల్‌ స్ట్రాటజీతో ’రాజ రాజ చోర’ టీజర్‌ అప్డేట్‌ ఇచ్చారు. తాజాగా చోరగాథ అంటూ బిగ్‌బాస్‌ ఫేమ్‌ గంగవ్వ వాయిస్‌ ఓవర్‌తో ఓ చిన్న 2డీ వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్‌. ఇందులో ‘చోరగాథ’ అంటూ గంగవ్వ ఓ కథ చెబుతుంది. ’’అనగనగా.. భూమి నుంచి కోతి వచ్చింది.. బంగారం వచ్చింది. కోతి మనిషి అయ్యింది.. బంగారం కిరీటం అయ్యింది. మనిషి దొంగ అయ్యిండు.. కిరీటం రాజు అయింది..’’ అంటూ ఆహ్లాదకరమైన ’రాజు – దొంగ’ కథ చెప్పింది గంగవ్వ. అయితే రాజు కిరీటాన్ని దొంగ ఎత్తుకెళ్లిన తర్వాత ఏమి జరిగింది.. రాజు ఏమి చేసాడు.. దొంగ దొరికాడా లేదా అంటూ చెప్పిన గంగవ్వ.. ’రాజ రాజ చోర’ టీజర్‌ జూన్‌ 18న రాబోతున్నట్లు తెలిసేలా చేసింది. అసలు రాజు – దొంగ కథ ఏంటి? కిరీటం సంగతి ఏంటి అనేది టీజర్‌ లో చెప్పనున్నారు.
అలాగే చోరగాధ చివర్లో వచ్చే ‘రాజరాజు వచ్చే లోకాలు మెచ్చే.. రాజ రాజ చోర వచ్చే బాధలోన్నో తెచ్చే’
అంటూ వచ్చే డైలాగ్స్‌ ఈ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తున్నాయి.

తనికెళ్ళ భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్,  శ్రీకాంత్‌ అయ్యంగార్, అజయ్‌ ఘోష్, వాసు ఇంటూరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వేదరామన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. విప్లవ్‌ నిషాదం ఎడిటింగ్‌ వర్క్‌ చేస్తున్నారు.