కరోనా వల్ల ప్రముఖ నటుడు మృతి

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ మరణించారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. అక్టోబర్ 5న ఆయనకు కరోనా సోకింది. దీంతో కరోనా చికిత్స కోసం కోల్‌కత్తాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.

soumitra chatterjee

కరోనా చికిత్స అందించిన కొద్దిరోజుల తర్వాత టెస్ట్ చేయగా.. అక్టోబర్ 14న ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో గత కొంతకాలంగా ఆస్పత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత విషమించడంతో ఆదివారం సౌమిత్ర ఛటర్జీ కన్నుమూశారు.

భారత సినిమా పరిశ్రమలోనే అగ్రనటుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. 2004లో పద్మభూషణ్ అవార్డు, 2012లో దాదాసాహెచ్ ఫాల్కే అవార్డు ఆయనకు లభించింది. సత్యజిత్ రేతో ఆయన 14 సినిమాల్లో పనిచేశారు. సౌమిత్ర ఛటర్జీ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.