బంగార్రాజు మొదలయ్యేది ఎప్పుడు కింగ్?

మనం.. ఈ జెనరేషన్ సినీ అభిమానులు చూసిన ఒక క్లాసిక్ సినిమా. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల వారసులు కలిసి నటించిన ఈ సినిమా, ఏఎన్నార్ చివరి సినిమాగా, అఖిల్ డెబ్యూ మూవీగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. విక్రమ్ కే కుమార్ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాలో నాగ చైతన్యకి కొడుకుగా నాగార్జున, కింగ్ నాగ్ కొడుకుగా అక్కినేని నాగేశ్వర్ రావు నటించి మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. అద్భుతమైన కథకి, అక్కినేని హీరోల మధ్య ఉన్న బాండింగ్ కూడా తోడవడంతో మనం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మనంతో మ్యాజిక్ క్రియేట్ చేసిన చై-నాగ్ మరోసారి ఒక కొత్త మాయ చేయడానికి సిద్ధమయ్యారు. అదేంటంటే 2016 సంక్రాంతికి కింగ్ నాగ్ సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో బంగార్రాజుగా కనిపించి మెప్పించాడు. వయసు పెరిగినా తనలో అందం తగ్గలేదని ప్రూవ్ చేసిన నాగార్జున, పంచె కట్టులో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సింపుల్ గా చెప్పాలి అంటే అందం విషయంలో యంగ్ హీరోలకే పోటీ ఇచ్చిన నాగ్ సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో 50కోట్ల క్లబ్ లో చేరి, కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమాకి ప్రీక్వెల్ విషయంలో ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా కూడా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. అయితే అన్నపూర్ణ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న వార్తల ప్రకారం, త్వరలో సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ సెట్స్ పైకి వెళ్లనుందట. అయితే ఇందులో లీడ్ రోల్ ని కింగ్ నాగ్ కాకుండా నాగచైతన్య ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో బంగార్రాజు కొడుకు రామ్ పాత్రకి లావణ్య త్రిపాఠితో పెళ్లవుతుంది, సినిమా ఎండింగ్ కి వచ్చే సరికి ఆమె ప్రెగ్నెంట్ అని చూపించి వదిలేస్తారు. ఇప్పుడు ఇదే పాయింట్ ని కంటిన్యూ చేస్తూ రామ్ కొడుకు పాత్రలో నాగ చైతన్య నటించనున్నాడు. యధావిధిగా తాత బంగార్రాజు పాత్రని నాగార్జున చేస్తున్నాడు. ఈ తాత మనవళ్ల కలయిక ఎలా ఉండబోతుంది? మనం మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా లేదా? తెలియాలి అంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బంగార్రాజు సినిమా సోగ్గాడేకి ప్రీక్వెల్ గా తెరకెక్కనుంది అంటున్నారు, అలాంటప్పుడు మొదటి భాగంలో మనం చూసిన దానికన్నా ముందు ఏం జరగబోతుంది అనేది బంగార్రాజులో చూపించాలి. అంతేగాని ఇందులో మనవడిగా నాగ చైతన్య పాత్ర ఎందుకు వచ్చింది? తాత మనవళ్ల మధ్య సీన్స్ ఎందుకు వస్తాయి అనేది దర్శకుడు కళ్యాణ్ కృష్ణకే తెలియాలి. వినడానికైతే స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది కాబట్టి దర్శకుడు ఈ గతాన్ని, ప్రస్తుతాన్ని ఎలా కలిపాడు? అసలు బంగార్రాజు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది అనేది తెలియాలి అంటే మరో కొన్ని రోజులు ఆగాల్సిందే.