‘సీతారామరాజుకు’ 22 ఏళ్లు

టాలీవుడ్‌లో అప్పటికీ, ఇప్పటికీ మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది. అప్పట్లో ఎన్టీఆర్-ఏఎన్నార్, ఎన్టీఆర్-కృష్ణ కాంబినేషన్‌లో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. అలాగే నందమూరి హీరో హరికృష్ణ-అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సీతారామరాజు’ అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై ఫిబ్రవరి 5వ తేదీకి సరిగ్గా 22 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాల గురించి తెలుసుకుందాం.

22 years of sitaramaraju

1999లో ఫిబ్రవరి 5వ తేదీన ఈ సినిమా విడుదలైంది. వై. వి. ఎస్. చౌదరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ, రవితేజ కలిసి నటించారు. ఇందులో హరికృష్ణ, నాగార్జున అన్నదమ్ములుగా నటించగా.. ఈ సినిమాలో అన్నదమ్ముల అనుబంధంను అద్భతంగా చూపించారు. ఇద్దరి అన్నదమ్ముల అనుబంధంతో పాటు చెల్లి వల్ల అన్నదమ్ముల మధ్య వచ్చే బేధాభిప్రాయాలు లాంటి వాటి చుట్టూ కథ ఉంటుంది. ఈ సినిమాను గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగార్జున, డి. శివప్రసాద్ రెడ్డి కలిసి నిర్మించారు. పోసాని కృష్ణ మురళి ఈ సినిమాకు మాటలు అందించారు. ఇక ఎం. ఎం. కీరవాణి మ్యూజిక్ అందించగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు.

ఇందులో కోట శ్రీనివాసరావు, రవితేజ, చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, శివాజీ, అపూర్వ, అపర్ణ కీలక పాత్రలలో నటించారు. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. సినిమాలో హరికృష్ణ, నాగార్జున మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. తెలుగు సినిమా చరిత్రలో ఇది ఎప్పటికీ మరచిపోలేని సినిమా అని చెప్పవచ్చు.