కొన్ని కథలు సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. కదిలిస్తాయి, ఆలోచింపజేస్తాయి, మార్పు దిశగా అడుగులు వేసేలా చేస్తాయి. అలాంటి అరుదైన ఆలోచింపజేసే కథతో రూపొందిన సందేశాత్మక చిత్రమే ‘సార్’. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ 100 కోట్ల దిశగా పయనిస్తోంది. ఇది గురువు గొప్పతనాన్ని తెలియజేసిన చిత్రం. పేద విద్యార్థుల చదువు కోసం బాల గంగాధర్ తిలక్ అనే ఓ గురువు సాగించిన పోరాటం ఈ చిత్రం. సిరిపురం అనే ఊరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు జూనియర్ లెక్చరర్‌గా వెళ్ళిన కథానాయకుడు.. అక్కడ విద్యార్థులెవరూ కళాశాలకు రాకపోవడంతో వారిని తిరిగి కళాశాలకు వచ్చేలా చేస్తాడు. కుల వ్యవస్థపై పోరాడేందుకు వారిలో చైతన్యం నింపుతాడు. ఈ చిత్రంలో విద్య గొప్పతనాన్ని తెలుపుతూ బాల గంగాధర్ తిలక్ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం. అయితే అలాంటి బాల గంగాధర్ తిలక్ నిజం జీవితంలోనూ ఉన్నారు.
కుమురం భీం జిల్లా కెరమెరి మండలం సావర్ ఖేడలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు కేడర్ల రంగయ్య. ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 60 లోపే. కానీ ఆయన కృషి ఆ సంఖ్యను 260 కి చేరేలా చేసింది. తన కూతురిని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి.. తన బాటలోనే ఆ గ్రామస్థులు నడిచేలా వారిలో స్ఫూర్తి నింపారు రంగయ్య. తన సొంత డబ్బుతో పాఠశాలను మరమ్మత్తులు చేయించడానికి పూనుకున్న ఆయనను చూసి గ్రామస్థులు ముందుకొచ్చి పాఠశాలకు కొత్త మెరుగులు దిద్దారు. ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన కృషికి గాను జాతీయ అవార్డు కూడా అందుకున్నారు రంగయ్య.
కేడర్ల రంగయ్య జీవితం సార్ చిత్రానికి స్ఫూర్తి కాదు. కానీ ఆయన జీవితం కూడా బాల గంగాధర్ తిలక్ కథ లాగే స్ఫూర్తిదాయంగా ఉంది. అదే కేడర్ల రంగయ్యను ‘సార్’ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి స్వయంగా కలిసేలా చేసింది. నిజజీవితంలో తాను చూసిన, విన్న సంఘటనల ఆధారంగా సార్ కథను, బాల గంగాధర్ తిలక్ పాత్రను తీర్చిదిద్దారు వెంకీ అట్లూరి. అయితే సినిమా విడుదలై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న సమయంలో.. తాను రాసుకున్న బాల గంగాధర్ తిలక్ పాత్రను పోలిన ఉపాధ్యాయుడు నిజంగానే ఉన్నారని తెలిసి వెంకీ అట్లూరి ఆశ్చర్యపోయారు, అంతకుమించి ఆనందపడ్డారు. కేడర్ల రంగయ్య గారిని కలవాలనుకున్నారు. అనుకోవడమే కాదు తాజాగా హైదరాబాద్ లో కలిశారు కూడా.
వెంకీ అట్లూరి, కేడర్ల రంగయ్య ఇద్దరూ కలిసి సార్ చిత్రం గురించి, సావర్ ఖేడ ప్రభుత్వ పాఠశాల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. సార్ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాల్లో తనని తాను చూసుకున్నట్లు ఉందని కేడర్ల రంగయ్య చెప్పడంతో వెంకీ అట్లూరి ఎంతగానో సంతోషించారు. అలాగే అతి చిన్న వయసులోనే ఉత్తమ ఉపాధ్యాయుడుగా జాతీయ అవార్డు అందుకున్నారని తెలిసి కేడర్ల రంగయ్యను వెంకీ అట్లూరి ప్రత్యేకంగా అభినందించారు. 13 సంవత్సరాల కాలంలో తాను ఎదుర్కొన్న సవాళ్ళను, సాధించిన ఘనతలను గుర్తు చేసుకున్న రంగయ్య.. ఇలాంటి అద్భుత చిత్రాన్ని రూపొందించిన వెంకీ అట్లూరికి కృతజ్ఞతలు తెలిపారు. “గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః” అనే దానికి ఇలాంటి గురువులను ఉత్తమ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విద్యార్థుల అభ్యున్నతి కోసం తమ జీవితాలను అంకితం చేసే ఇలాంటి గొప్ప ఉపాధ్యాయులకు సార్ మూవీ టీం సెల్యూట్ చేస్తుంది. పేద విద్యార్థుల విద్య కోసం ఎంతగానో కృషి చేస్తున్న కేడర్ల రంగయ్యకు అండగా నిలిచి.. ఇంతటి గొప్ప కార్యంలో తాము కూడా భాగం కావాలన్న ఉద్దేశంతో చిత్ర బృందం తరఫున వారి వంతుగా రు. 3 లక్షలు ఆర్ధిక తోడ్పాటు అందించారు. ఆయన అద్వితీయ ప్రయాణానికి సహకారంగా అందించిన ఈ ఆర్థిక సాయం.. పాఠశాలల్లో లైబ్రరీల నిర్మాణానికి, విద్యార్థులకు వారి విద్య, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విజయానికి కీలకమైన పుస్తకాలు మరియు విద్యా వనరులను అందించడానికి దోహదపడుతుంది.
కోలీవుడ్ స్టార్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం సార్(వాతి). ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. హ్యాడ్సమ్ హీరో సుమంత్ అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ భారీ వసూళ్లతో మరింతగా దూసుకుపోతోంది.