మరో #MeeToo వివాదం, సింగర్ పై మరో సింగర్ కామెంట్స్

గతేడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేసిన #Meetoo ఉద్యమం మళ్లీ బయటకి వచ్చింది. చాలా రోజులుగా కాస్త సైలెంట్ గా ఉన్న #Meetoo ఆరోపణలు ఇప్పుడు బాలీవుడ్ సింగర్ పై వినిపిస్తున్నాయి. సింగర్ అను మాలిక్ పై వరసగా వినిపిస్తున్న ఆరోపణలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. సింగర్ సోనా మొహాపాత్ర అను మాలిక్ పై మీటూ ఆరోపణలు చేసింది. ఇవి మర్చిపోయేలోపు పాపులర్ సింగర్ నేహా భాసిన్, అను తనతో ప్రవర్తించిన తీరును సోషల్ మీడియాలో బట్టబయలు చేస్తూ వరుస ట్వీట్స్ తో సంచలనం సృష్టించింది. అను మాలిక్ కామాంధుడంటూ తిట్టిపోస్తూ… ‘నువ్వు చెప్పింది నిజమే సోనా, అను మాలిక్ ఓ కామాంధుడు. వాడు నన్ను కూడా వదిలిపెట్టలేదు. 21 ఏళ్ల వయసులో నేను అను మాలిక్ స్టూడియోకి వెళ్లాను. నేను పాడిన పాటల సీడీ ఆయనకు చూపిస్తే నచ్చి నాకు ఛాన్స్ ఇస్తాడనుకున్నా. కానీ ఇలా అసహ్యంగా ప్రవర్తిస్తాడని అస్సలు ఊహించలేదు. ఆ సమయంలో అతను సోఫాలో కూర్చుని నా కళ్లను పొగుడుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. నాకు భయమేసి కింద మా అమ్మ ఎదురుచూస్తోంది సర్ అని వెళ్లిపోయాను. ఆ తర్వాత అను నాకు చాలా ఫోన్లు, మెసేజ్‌లు చేశాడు. కానీ నేను స్పందించలేదు. నాకంటే వయసులో పెద్దవాడైన అతను ఇలా ప్రవర్తించడం ఎంత వరకు కరెక్ట్? వాడు మళ్లీ టీవీలో ఎలా కనిపిస్తున్నాడో నాకు అర్థంకావడంలేదు. ఈ నిజాలన్నీ బయటపట్టాక నాకు ఏం జరిగినా ఫర్వాలేదు. ఎన్ని సార్లు తప్పించుకున్నా నిజం ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని నేహా ట్వీట్స్ చేసింది.

అయితే అను మాలిక్ చేస్తున్న ఒక సింగింగ్ రియాల్టీ షోకి గెస్ట్ గా వెళ్లిన సచిన్ టెండుల్కర్ ని కూడా నేహా ట్యాగ్ చేస్తూ… ‘సచిన్ సర్.. మీకు మీటూ గురించి ఏమీ తెలీదా? మీరు మెచ్చుకుంటున్న షోలో అను మాలిక్ అనే కామాంధుడు ఉన్నాడు. మీరు ఎప్పుడూ ఆ షోలో పాల్గొనేవారినే మెచ్చుకుంటారా? అను మాలిక్ వల్ల మాలాగా ఇబ్బందులు పడిన ఆడవాళ్ల గురించి అస్సలు పట్టించుకోరా?’ అని ప్రశ్నించింది. అయితే ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడో ఏమో సచిన్ మాత్రం దీనిపై స్పందించలేదు.