శ్రుతిహాసన్ విశ్వనటుడు కమల్‌హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడింది. 2011లో వచ్చిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం బాక్సఫీస్ వద్ద పరాజయం కాగా.. వరుస పరాజయాలతో ఐరన్‌లెగ్‌గా ముద్రపడిపోవడంతో ఆమెతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు, హీరోలు భయపడ్డారు. ఆ సమయంలో వచ్చిన గబ్బర్‌సింగ్ ఆమె జీవితాన్నే మార్చేసింది.
బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన దబాంగ్ చిత్రానికి ఈ సినిమా రీమేక్‌గా.. పవన్‌కళ్యాణ్ డిఫరెంట్ మేనరిజంతో ఆ సినిమా బ్లాక్‌బస్టర్ సాధించి శ్రుతికి కూడా స్టార్ హోదా తీసుకొచ్చింది. అప్పటినుంచి వరుస సక్సెస్‌లో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే.. శ్రుతిహాసన్ ఇప్పుడు మూడేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇస్తూ.. రవితేజ హీరోగా నటించిన క్రాక్ చిత్రంతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది శ్రుతిహాసన్. ఇందులోనూ రవితేజ భార్యగా ఆమె నటించగా.. గబ్బర్‌సింగ్ చిత్రంలో పవన్‌కళ్యాణ్ భార్యగా నటించి మెప్పించింది. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధం ఏంటీ? అనుకుంటున్నారా.. అప్పట్లో గబ్బర్‌సింగ్ సినిమా విడుదలయ్యే సమయానికి పవన్‌కళ్యాణ్, శ్రుతిహాసన్‌తో పాటు అటు నిర్మాత, ఇటు దర్శకుడు సైతం మంచి విజయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పుడు క్రాక్ చిత్రం విడుదల సమయానికి రవితేజ, శ్రుతిహాసన్, డైరెక్టర్, నిర్మాతల కూడా ఇదే పరిస్థితి. ఈ క్రమంలో క్రాక్ చిత్రం మంచి విజయంతో, కలెక్షన్లతో దూసుకుపోతుంది.