14 ఏళ్ల తర్వాత హిట్ కాంబినేషన్ రిపీట్ అయ్యింది

శోభన… ఒకప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించిన క్లాసికల్ డాన్సర్. స్వతహాగా మలయాళీ అయిన శోభన తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది, మరిన్ని స్టేజ్ షోస్ చేసింది. నెమ్మదిగా సినిమాలు తగ్గిస్తూ వచ్చిన శోభన, 2006లో చివరగా మోహన్ బాబు విష్ణు కలిసి నటించిన గేమ్ సినిమాలో కనిపించింది. 13 ఏళ్లు గడిచినా మళ్లీ తెలుగు సినిమాల వైపు చూడని శోభన, అప్పుడప్పుడూ తమిళ మలయాళ సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. తమిళ్ లో 2012లో పోడాపోడి సినిమాలో నటించింది, ఈ మూవీ తర్వాత కొచ్చడయాన్ సినిమాలో నటించినా కూడా అది మోషన్ గ్రాఫిక్స్ సినిమా కావడంతో పోడాపోడినే ఆమె చివరి చిత్రంగా భావిస్తారు.

shobana sresh gopi

మలయాళంలో నాలుగేళ్ల గ్యాప్ తర్వాత 2013లో తిరా సినిమా చేసిన శోభన, మళ్లీ ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ఒక సినిమాలో నటిస్తోంది. అది కూడా సురేష్ గోపి పక్కన కావడం విశేషం. ఈ ఇద్దరి కలయికలో మణిచిత్రతాళే, ఇన్నలే, కమీషనర్‌ లాంటి సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. 2005లో మక్కళుక్కు అనే సినిమాలో చివరిసారి కలసి నటించిన శోభన, సురేష్ గోపి… ఇప్పుడు అనూప్‌ సత్యన్‌ దర్శకత్వంలో 14 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. ఈ మూవీ ఫస్ట్ డే షూటింగ్‌లో తీసిన ఫొటో బయటకి వచ్చింది దీంట్లో శోభన, సురేష్ గోపి కలిసి కనిపించి అభిమానులని సంతోష పెట్టారు. 2020లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది.