

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్ లో రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకం పై రూపేష్ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమా మే 30న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక శనివారం (మే 24) నాడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఈస్ట్ శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ , పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
‘మనం ఎవరో తెలియకుండానే ప్రేమించేది తల్లి.. తనకు తెలియని ప్రపంచాన్ని కూడా భుజాలపై ఎక్కించుకుని మరీ మనకు చూపించేది తండ్రి’.. అంటూ ట్రైలర్ ప్రారంభంలో హీరో చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ తరువాత ‘సరిగ్గా లేనివాటిని సవరించడం నా కర్తవ్యం.. న్యాయాన్ని కాపాడటం నా వృత్తి’ అంటూ హీరో కారెక్టరైజేషన్‌ను చెప్పే డైలాగ్.. ‘మనసుని కాకుండా మనిషి అలవాట్లను ప్రేమించే నువ్వు మార్పు గురించి మాట్లాడకు’ అని రాజేంద్ర ప్రసాద్ చెప్పే ఎమోషనల్ డైలాగ్‌తో కథలోని ఎమోషన్ అర్థం అవుతుంది.. ‘అన్నీ అనుకున్నట్టు జరిగే అది జీవితం ఎందుకు అవుతుంది?’.. ‘అసలు ఇలాంటి పరిస్థితి నాకే కాదు ఎవ్వరికీ రాకూడదు’ అంటూ ట్రైలర్ చివర్లో చూపించిన సీన్లతో కథలోని సంఘర్షణ అందరికీ తెలుస్తుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘షష్టి పూర్తి’ టైటిల్‌తో కథ నా వద్దకు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. వయసుకు తగ్గ పాత్రలు నాకు ఒక్కడికే వస్తున్నాయా? అని ఆశ్చర్యం వేసింది. నేను నిజ జీవితంలో షష్టి పూర్తిని తప్పించుకోవాలని ప్రయత్నించాను. కానీ ఇలా సినిమా రూపంలో ‘షష్టి పూర్తి’ జరిగింది. అది నటుడిగా నా అదృష్టం. ఈ రోజు ఇక్కడకు నా కోసం వచ్చిన నా సోదరులైన రామ్మోహన్, ప్రసాద్ గార్లకు థాంక్స్. మేం ఎప్పుడు కలిసినా కూడా రాజకీయాల గురించి మాట్లాడుకోం. పెళ్లి సమయంలో నా పాటే.. చావు సమయంలో నా పాటే.. ఇక షష్టి పూర్తి టైంలో పాట లేదండి అని కొందరు అనేవాళ్లు. ఇప్పుడు ఆ ‘షష్టి పూర్తి’ పాట కూడా వచ్చింది. మళ్లీ ఆ పాటను ఇళయరాజా గారు చేయడం మరో అదృష్టం. ఇక పవన్ ప్రభ మ్యూజిక్ టేస్ట్ మామూలుగా ఉండదు. కీరవాణి గారితోనూ ఓ పాట రాయించుకున్నాడు. చైతన్య ప్రసాద్ ఎన్నో గొప్ప పాటల్ని రాశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్ని చాటి చెప్పేలా మా చిత్రం ఉంటుంది. తల్లిదండ్రుల పెళ్లిని బిడ్డలు చూడలేరు.. అలా బిడ్డలు చూడగలిగే తల్లిదండ్రుల పెళ్లే మా ఈ ‘షష్టి పూర్తి’. అర్చనతో ఇన్నేళ్ల తరువాత కలిసి నటించడం ఆనందంగా ఉంది. మా హీరో, నిర్మాత రూపేశ్ ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డారు. ఆకాంక్ష చక్కగా నటించారు. ఇది మన తెలుగు వారందరి సినిమా. మే 30న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ .. ‘‘షష్టి పూర్తి’ లాంటి చక్కటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఎప్పుడూ అండగా నిల్చున్నారు. ఆయన సినిమా చూస్తే చాలు మా కష్టాలన్నీ, ఒత్తిళ్లు పోతాయి. ఈ మాటలు నేను కాదు సాక్ష్యాత్తు పీవీ నరసింహారావు గారు అన్న మాటలే. కుటుంబ విలువల్ని కాపాడాలని ‘ఆ నలుగురు’ సినిమాతో సందేశాన్ని ఇచ్చారు. పిల్లలే తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి అంటూ ‘షష్టి పూర్తి’ చేస్తే కలిగే ఆనందం గురించి మాటల్లో చెప్పలేం. మళ్లీ కుటుంబ విలువల్ని చాటి చెప్పేందుకు ఈ చిత్రం వస్తుంది. ఇలాంటి చిత్రాలు సమాజం కోసం సక్సెస్ అవ్వాలి. అర్చన గారిని చూస్తే నాకు పాత సినిమాలన్నీ గుర్తుకు వచ్చాయి. దర్శక, నిర్మాతలకు మంచి విజయం దక్కాలి’ అని అన్నారు.
శాసనసభ సభ్యులు బోడె ప్రసాద్ మాట్లాడుతూ .. ‘రాజేంద్ర ప్రసాద్ గారు నాకు మంచి ఆప్తులు. ఆయన ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చాను. సినిమా ఫంక్షన్లో పాల్గొనడం ఇదే మొదటి సారి. రూపేశ్ గారికి ఈ చిత్రంతో మంచి విజయం దక్కాలి. చైతన్య ప్రసాద్ పాటలు నాకు చాలా ఇష్టం. ఆ నలుగురు సినిమా అన్నా, ఆయన రాసిన పాటలన్నా నాకు చాలా ఇష్టం. నాకు అన్న ఎన్టీఆర్ గారు తరువాత, రాజేంద్ర ప్రసాద్ గారంటే చాలా ఇష్టం. ‘షష్టి పూర్తి’ చిత్రం పెద్ద విజయం సాధించాలి. అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు.
హీరో, నిర్మాత రూపేశ్ మాట్లాడుతూ .. ‘మా సినిమా కోసం వచ్చిన రామ్మోహన్ గారికి, ప్రసాద్ గారికి థాంక్స్. మా చిత్రం కోసం పెద్ద పెద్ద టెక్నీషియన్లు పని చేశారు. అది నా క్రెడిట్ కాదు. ఇంత మంచి కథ నా వద్దకు రావడం నా అదృష్టం. ఈ క్రెడిట్ అంతా కూడా దర్శకుడు పవన్‌దే అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారితోనే ఇకపై అన్ని చిత్రాలు చేయాలనిపిస్తుంది. ఏడాది క్రితం సినిమా షూట్ అయిపోయింది. ఏడాది పాటుగా ఈ మూవీని భుజాన మోస్తూనే ఉన్నారు. అర్చనమ్మతో షూటింగ్ చేస్తుంటే.. ఇంట్లో అమ్మతో ఉన్నట్టు అనిపించేది. మా లాంటి కొత్త వారితో పని చేసేందుకు వచ్చిన ఆకాంక్ష గారికి థాంక్స్. చైతన్య ప్రసాద్ గారు ఈ కథను మాకంటే ఎక్కువగా నమ్మారు. ఆయన సపోర్ట్ వల్లే మేం ఇక్కడి వరకు రాగలిగాం. ఇలాంటి కుటుంబ కథను, విలువలు చెప్పే కథను నేను చిన్న స్కేల్‌లో చూపించలేను. కథకు ఇంత భారీతనం అవసరం. అందుకే అలాంటి కాస్ట్, ఇళయరాజా గారు, తోట తరణి వంటి వారిని తీసుకున్నాం. మే 30న మా చిత్రం విడుదల అవుతోంది. రెండ్రోజుల్లోనే నా డబ్బులన్నీ తిరిగి వస్తాయి’ అని అన్నారు.

దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ ..‘‘షష్టి పూర్తి’ సినిమా ఇంత బాగా రావడానికి సహకరించి పని చేసిన ప్రతీ ఒక్కరికి థాంక్స్. అందరికీ మా సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారి లాంటి గొప్పవారితో పని చేసే అవకాశం ఇచ్చిన రూపేశ్ గారికి థాంక్స్. ఈ చిత్రానికి చైతన్య ప్రసాద్ గారు పెద్ద కొడుకు లాంటి వారు. మాకు ఇంత మంచి సంగీతం ఇచ్చిన ఇళయరాజా గారికి, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారికి థాంక్స్. మే 30న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
నటి అర్చన మాట్లాడుతూ .. ‘మా ‘షష్టి పూర్తి’ సినిమా కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఆకాంక్ష చాలా మంచి నటి. ఎంతో గొప్ప టాలెంట్ ఉన్న నటి. పవన్ ప్రభ తన తల్లి పేరుని పెట్టుకున్నాడు. సినిమాలోని ప్రతీ ఎమోషన్‌ను తన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాడు. రాజేంద్ర ప్రసాద్ గారు ఓ సినిమాలో ఉంటే.. అందులో అన్నీ ఉన్నట్టే. ఏ పాత్రలోకైనా, ఏ సినిమాలోకి అయినా ఆయన పరకాయ ప్రవేశం చేస్తారు. ఆయన చాలా గొప్ప నటులు. మళ్లీ రెండు దశాబ్దాల తరువాత రాజేంద్ర ప్రసాద్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మళ్లీ ఇళయరాజా గారి సంగీత సారధ్యంలో పని చేయడం సంతోషంగా ఉంది. మా అందరినీ పవన్ ప్రభ ఒక చోటకు తీసుకు వచ్చారు. హీరోగా, నిర్మాతగా రూపేశ్ ఈ చిత్రానికి వంద శాతం న్యాయం చేశారు. అసలు ఈ రోజుల్లో ఓ సినిమా తీయడం, ముగించడం ఓ యాగం, విష పరీక్ష లాంటిది. ఇలాంటి ఓ సినిమాను తీయడం అంత సులభం కాదు. మే 30న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ .. ‘‘షష్టి పూర్తి’ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ఈ మూవీతో నాకు ఓ మంచి ఫ్యామిలీ దొరికింది. ఈ మూవీ అందరినీ ఏడ్పిస్తుంది.. నవ్విస్తుంది.. ఎమోషన్స్‌తో కదిలిస్తుంది. జానకి లాంటి మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. రాజేంద్ర ప్రసాద్ గారితో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. అర్చన గారిని చూస్తే మా అమ్మగారే గుర్తుకు వచ్చారు. ఇళయరాజా గారి సంగీతం మా సినిమాకు బలం. మే 30న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ .. ‘తుమ్మలపల్లి కళాక్షేత్రం అంటే నాకు చాలా ఇష్టం. ఈ స్థలం నాకు ఎంతో మంది స్నేహితుల్ని ఇచ్చింది. ఈ సినిమాకు పాటలు రాయమని పవన్, రూపేశ్ నా వద్దకు వచ్చారు. ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో పాటలు రాయమని చెప్పారు. అది నేను నమ్మలేదు. టికెట్ వేసి చెన్నైకి తీసుకెళ్లే వరకు నమ్మలేదు. ఇళయారాజా గారి స్టూడియోలోకి వెళ్లడంతో నాకు గర్భగుడిలోకి వెళ్లినట్టు అనిపించింది. నేను ఎంతో మందికి పాటలు రాశాను. కానీ ఇళయరాజా గారికి రాసే అవకాశం నాకు ‘షష్టిపూర్తి’ టీం ఇచ్చింది. ఈ టీంకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని అన్నారు.