
రూపేష్, ఆకాంక్షా సింగ్ హీరో, హీరోయిన్లుగా, ‘లేడీస్ టైలర్’ కపుల్ రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం‘షష్టిపూర్తి’. ఈ సినిమాకి వున్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ చిత్రానికి విశ్వవిఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం శనివారం నాడు హైదరాబాద్‌లోని ఆర్.కె. సినీ మాక్స్.లో జరిగింది. సంగీత దర్శకుడు ఇళయరాజా, ఈ చిత్రంలోని ‘ఏదో ఏదేదో’అంటూ సాగే ఒక పాటకు లిరిక్స్ అందించిన మరో సంగీత దర్శకుడు కీరవాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘షష్టిపూర్తి’ మూవీ టీజర్ ‘మేస్ట్రో’ ఇళయరాజా చేతుల మీదుగా విడుదలైంది.
దర్శకుడు పవన్ ప్రభ, డీఓపీ రామ్, ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్, గీత రచయిత చైతన్య ప్రసాద్, రూపేష్, ఆకాంక్షాసింగ్, కీరవాణి, రాజేంద్రప్రసాద్, ఇళయరాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భగా సినిమాటోగ్రాఫర్ రామ్ మాట్లాడుతూ, ‘‘ఇలాంటి లెజండరీస్‌తో వర్క్ చేయడం చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాను’’ అన్నారు.
గీత రచయిత చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ, ‘‘ఈ షష్టిపూర్తి సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, కీరవాణి గారికి చాలా పాటలు రాశాను. నాకు మిగిలిపోయిన ఆశ ఇళయరాజా గారికి ఒక్క పాటైనా రాయాలని. నాకు మూడు పాటలు రాసే అవకాశం నాకు ఈ సినిమా ఇచ్చారు. ఈ సినిమా రూపొందించడంలో పవన్ ప్రభ, రూపేష్ అద్భుతమైన కృషి చేశారు. ఈ సినిమాకి కీరవాణి పాట రాశారు. అది ఒక అద్భుతంలా జరిగింది. మేం చెప్పిన 20 నిమిషాల్లోనే అద్భుతమైన పాట రాశారు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ, ‘‘ఇంత గొప్ప వారు నా సినిమాకి పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. నేను అదృష్టవంతుడిని’’ అన్నారు.
కథానాయిక ఆకాంక్షాసింగ్ మాట్లాడుతూ, ‘‘నాకు ఈ సినిమా చాలా గొప్ప అనుభవం. ఇంత గొప్పవారితో వేదిక పంచుకోవడం, వారు సినిమాకి పని చేయడం నా అదృష్టం. నవరసభరితమైన ఈ సినిమా మాకు గర్వకారణంగా నిలుస్తుంది’’ అన్నారు.
కళా దర్శకుడు తోట తరణి మాట్లాడుతూ, యూనిట్ బాగా పనిచేశారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. ఈ సినిమాకి పనిచేయడం నాకు చాలా నచ్చిందని అన్నారు.
కథనాయకుడు, నిర్మాత రూపేష్ మాట్లాడుతూ, ‘‘ఇంత పెద్ద దిగ్గజాలతో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు.
కీరవాణి మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాలో రాజా సార్ ట్యూన్‌కి నేను రాసిన పల్లవి ‘ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం.. నీదో, నీవల్ల నాదో ఈ పరవశం. రాగం నీదై, పల్లవి నాదై చరణం, చరణం కలిసిన వేళ పయనాలు ఏ హిమాలయాలకో ’ అనే పాట రాశాను. సాధారణంగా డైరెక్టర్ సిట్యుయేషన్ చెప్పినప్పుడు ఆ కథకి, ఆ పాత్రలకి తగినట్టుగా పాట రాయడం జరుగుతూ వుంటుంది. ఈ సినిమాలో నేను రాసిన పాట ఈ సినిమాలోని సందర్భంతోపాటు, నా జీవితానికి కూడా సంబంధించింది. నేను కేవీ మహదేవన్ గారి వీరాభిమానిని. ఆయన పాటలంటే చాలా ఇష్టం. ఆయన చేసిన పాటలన్నీ నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ‘యుగంధర్’ సినిమాలోని ఒకపాటలో ఒక వయొలిన్ బిట్ విని నేను ఇళయరాజా గారి సంగీతానికి అభిమానిగా మారాను. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నేను మద్రాసు వెళ్ళినప్పుడు, ఇళయరాజా గారి ఇల్లుని ఆరాధనా భావంతో చూసేవాడిని. ‘అన్వేషణ’ సినిమాలో ‘కీరవాణి’ అంటూ సాగే పాట వుంది. విజయేంద్ర ప్రసాద్ గారు ఆ పాట నాకు వినిపించి, ఇలా చేయగలవా అన్నారు. అద్భుతమైన ఆ పాట నాకు నేను ఈ స్థాయిలో చేయగలనా అని భయం కలిగించింది. చాలా సంవత్సరాల తర్వాత చక్రవర్తి గారి దగ్గర పరిచేసేటప్పుడు వేటూరి గారు ఇళయరాజా గారిని కలిసే భాగ్యం కలిసింది. ఇలా క్రమంగా ఆయనకు దగ్గర అవుతూ వుండగా, ‘అనుమానాస్పదం’ అనే సినిమా ఆడియో ఫంక్షన్‌కి నేను అతిథిగా వెళ్ళే అవకాశం కలిగింది.. ఆ తర్వాత ఎన్నోసార్లు ఆయనను కలిసే భాగ్యం కలిగింది. నా కెరీర్లో మొదట్లో రెండేళ్ళపాటు ఇళయరాజా గారి ప్రభావంతో సంగీతం చేశాను. ఇళయరాజా గారి సంగీతానికి పాడాలని అనుకున్నాను. కానీ, ఆ అవకాశం రాలేదు. కానీ ఆయన సంగీతానికి పాట రాసే అవకాశం వచ్చింది. ఆయన పక్కన కూర్చునే అవకాశం కూడా వచ్చింది. ఈ సినిమాలో నేను రాసిన సినిమాలో పాటగా మాత్రమే కాకుండా ఆయనతో నాకున్న పరిచయాన్ని ప్రతిఫలించేలా వుంటుంది. ఈ సినిమాలో పాట రాసే అవకాశం నాకు ఇప్పించిన రూపేష్, పవన్‌కి, వారికి వారధిగా నిలిచిన చైతన్య ప్రసాద్‌కి కృతజ్ఞతలు’’ అన్నారు.

రాజేందప్రసాద్ మాట్లాడుతూ, ‘‘నేను ఇళయరాజా గారిని స్వామి అని పిలిచేవాడిని. తన సంగీతంతోనే చాలామందిని హీరోలని చేసింది ఇళయరాజా సంగీతం. ‘ప్రేమించు పెళ్ళాడు’కి ఆయన మొదట నా సినిమాకి సంగీతాన్ని అందించారు. ‘ప్రేమించు పెళ్ళాడు’ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న నాకు ‘లేడీస్ టైలర్’ ప్రాణం పోసింది. ఆ సినిమా ఆడకపోతే ఆత్మహత్య చేసుకునేవాడినేమో. ఇళయరాజా సంగీతం వల్లే ఆ సినిమా హిట్టయింది. ‘లేడీస్ టైలర్’ డబుల్ పాజిటివ్ చూసిన ఇళయరాజా నన్ను తీసుకొస్తేనే రీ-రికార్డింగ్ చేస్తానని అన్నారు. అప్పుడు నేనే షూటింగ్లో గాయపడి వున్నప్పటికీ, అలాగే ఇళయరాజా గారి దగ్గరకి వెళ్ళాను. నన్ను మొదటిసారి చూసిన ఇళయరాజా నన్ను ‘రా’ అని పిలిచారు. చాలా బాగా నటించావు అన్నారు. నీ యాక్టింగా, నా రీ-రికార్డింగా తేల్చుకుందాం అని, నన్ను థియేటర్లోనే కూర్చోపెట్టి రీ రికార్డింగ్ చేశారు. అలాంటి మా ‘స్వామి’ ఇంతకాలానికి నా సినిమాకి సంగీతాన్ని అందించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. కీరవాణి గారు పాట రాశారంటేనే ఈ సినిమా ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. కీరవాణి గారితో కూడా నాకు ఎంతో అనుబంధం వుంది. ఆయన వందవ సినిమా నా ‘రాంబంటు’. నేను నిజ జీవితంలో ‘షష్టిపూర్తి’ చేసుకోలేదు. నాకు నట జీవితంలో ‘షష్టిపూర్తి’ వచ్చింది. చక్కటి కథతో రూపొందిన సినిమా ఇది. ఇందులో నేను అద్భుతమైన పాత్ర చేశాను. ఈ సినిమా పెయింటింగ్ వేసినట్టు వుంటుంది. అది పద్మశ్రీ తోట తరణి, కెమెరామన్ రామ్ ప్రతిభ. తెలుగు సినిమాకి కావలసిన అన్ని విలువలూ వున్న సినిమా ఇది’’ అన్నారు. ఈ సందర్భంగా ఇళయరాజా పాదాలకు రాజేంద్రప్రసాద్ నమస్కరించారు.
సంగీత దర్శకుడు ఇళయరాజా మాట్లాడుతూ, ‘‘ఈ ఏజ్‌లో కూడా ఇలా సంగీతం చేస్తున్నారే అంటున్నాడు రాజేంద్రప్రసాద్.. ఈ ఏజ్‌లో సంగీతం చేయకూడదా? ఎలా చేస్తున్నారే అంటే పర్లేదు.. ఇలా చేస్తున్నారేంటి అంటున్నారు… చేయకూడదా రాజేంద్రపసాద్.. వీడు మావాడే.. వీడు వంశీ.. ఇలా ఒక గ్రూప్ వుండేది. వాళ్ళందరూ నా నా కంపోజింగ్ రూమ్ ముందు గలాటా చేసేవారు. నేను ఇక్కడకి వచ్చింది మాట్లాడ్డానికి కాదు. మాట్లాడానికి ఏమీ లేదు. ఈ సినిమాకి నేను చేసిన వర్క్ మీరు విన్నారు… వినబోతున్నారు.. వింటూనే వుంటారు.. ఆ నమ్మకం వుంది. కీరవాణి రాసిన పాట పల్లవి వినిపించినప్పుడు, కీరవాణి తన మనసులో నామీద వున్న ఆత్మ బంధాన్ని రాశారని నాకు అర్థమైంది. నా మీద వున్న అభిమానం కీరవాణిలో ఎప్పుడూ మారలేదు. సంగీత దర్శకుడు అవడానికి ముందు, సంగీత దర్శకుడిగా పాపులర్ అయిన తర్వాత కూడా ఆయనకు నా మీద అభిమానం అలాగే వుంది. దేవుడు ఈ సినిమాకి, ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ఆశీస్సులు అందించాలి. లాంగ్ లైఫ్ ఫేమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. మీరు చేసిన వేలాది పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది అని అడిగితే, ‘ఒకటా.. రెండా… నేను నాకు ఎంత సంగీతం తెలుసన్నది ముఖ్యం కాదు.. సంగీతమే నాకు గురించి తెలుసుకుంది. నాలోంచి సంగీతం ఎలా వస్తోందో నాకు తెలియదు. ఆ సంగతి తెలిసిన మరుక్షణంలోనే నేను సంగీతాన్ని ఆపేస్తాను… నాకు నాలోంచి సంగీతం ఎలా వస్తోందో నాకు ఎప్పటికీ తెలియకూడదని దేవుడిని కోరుకుంటున్నాను. నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్లలో పాల్గొనేది చాలా తక్కువ. ‘షష్టిపూర్తి’ సినిమా ద్వారా కొత్తవాళ్ళు, మొదటి ప్రయత్నంచేస్తున్నారు. వారిని ప్రోత్సహించాలనే ఇక్కడకి వచ్చాను. ఈ సినిమా చేస్తున్న కొత్తవారిని ప్రోత్సహించడానికే వచ్చాను’’ అన్నారు. ఈ సందర్భంగా ఇళయరాజాకి భారతరత్న రావాలన్న ఆకాంక్షను ఈ కార్యక్రమంలో పలువురు వ్యక్తం చేశారు.