ప్రముఖ స్టార్ డైరెక్టర్ ‘విద్యాసాగర్ రెడ్డి’ కన్నుమూత!

ప్రముఖ తెలుగు దర్శకుడు ‘విద్యాసాగర్ రెడ్డి’ నేడు కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అయన ఈరోజు ఉదయం చెనైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

40 ఏళ్ళ సినీ కెరీర్ లో దాదాపు 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు. నరేష్, విజయ్ శాంతి కలయికలో తెరకెక్కిన ‘రాకాసి లోయ’ సినిమాతో దర్శకుడిగా పరిచమైన విద్యాసాగర్.. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నారు. ఆ తరువాత కూడా స్టూవర్టుపురం దొంగలు, అమ్మదొంగ, రామసక్కనోడు వంటి హిట్ సినిమాలతో కెరీర్ మొత్తంలో సక్సెస్ రేటుని ఎక్కువ చూశారు. సుమన్, భానుచందర్ లతో ఎక్కువ సినిమాలు తీసిన విద్యాసాగర్ కృష్ణ, రవితేజలతో కూడా చిత్రాలు తెరకెక్కించాడు.

సుమన్ హీరోగా తెరకెక్కిన రామసక్కనోడు సినిమాకు గాను మూడు నంది అవార్డులు అందుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న శ్రీను వైట్ల కూడా ఆయన దగ్గర శిష్యులుగా పనిచేసిన వారే. కాగా తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పని చేశారు సాగర్. మంగళగిరి వద్ద నిడమర్రు అనే గ్రామంలో 1952 మార్చి 1న జన్మించిన విద్యాసాగర్ రెడ్డి 70 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.