అభ్యుదయ రచయిత ‘అదృష్టదీపక్’ ఇకలేరు! కరోనానే కారణం

‘అన్యాయం అక్రమాలు దోపిడీలు దురంతాలు ఎన్నాళ్ళని ఎన్నేళ్లు’

‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’

రచయిత అదృష్టదీపక్ నుంచి వచ్చిన అద్భుతమైన పదాలు అవి.. అభ్యుదయ భావాలతో ఆధునిక తెలుగు కవిత్వరంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న అదృష్ట దీపక్ గారు గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్నారు. కాకినాడలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. 1980 లో ‘యువతరం పిలిచింది’ సినిమాలోని ‘ఆశయాలపందిరిలో అనురాగం సందడిలో’ అనే పాటతో సినీ గీత రచయితగా కెరీర్ ప్రారంభించి, దాదాపు 40 కి పైగా సినిమా పాటలు రాశారు. ముఖ్యంగా ఆయన భావాలకి తగిన గీతాలని ‘ఎర్రమల్లెలు’, ‘నేటిభారతం’, ‘ఎర్రోడు’, ‘నవోదయం’, ‘దేశంలో దొంగలు పడ్డారు’, ‘జైత్రయాత్ర’ ‘కంచుకాగడా, ‘ఎర్రమందారం’, ‘దేవాలయం’, ‘మా ఆయన బంగారం’ లాంటి సినిమాలకి ఇచ్చారు. ‘ఉదయించని ఉదయం కోసం ఎదఎదలో రగిలెను హోమం’, ‘జాగోరే జంబాయిరే’, ‘అక్షరాలీవేళ అగ్ని విరజిమ్మాలి’ మొదలైన పాటలు అదృష్ట దీపక్ నుంచి వచ్చిన సంచలనాలు. ఈ పాటలు ఇప్పుడు విన్నా రక్తం వేడితో పాటు వేగం అందుకుంటుంది. ఎన్నో పురస్కారాలు అందుకున్న ఆయన కరోనా కారణంగా మరణించడం తెలుగు సాహిత్యానికి తీరని లోటే.