సీనియర్ నటుడు ‘జయ ప్రకాష్ రెడ్డి’ కన్నుమూత!!

సీనియర్ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ రోజు ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన టాలీవుడ్ ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. 74 ఏళ్ల జయప్రకాష్ రెడ్డి గతంలోనే కొంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ తొందరగానే కొలుకున్నారు.

ఇక వైద్యుల సలహా మేరకు సినిమాలు కూడా ఎక్కువగా చేయడం లేదు. ఇక ఈ రోజు ఉదయం ఆయన తుది శ్వాస విడువడంతో ఒక్కసారిగా సినీ ప్రముఖులను ఈ విషయం షాక్ కి గురి చేసింది.1988లో బ్రహ్మపుత్రుడు సినిమా ద్వారా నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన జయ ప్రకాష్ ఒకానొక సమయంలో బిజీ ఆర్టిస్టుగా ఉన్నారు. దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించారు. ఇక వయసు రీత్యా ఆయన గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక జయ ప్రకాష్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.