అద్భుత స్పందనతో ‘సారంగపాణి జాతకం’ సెలెబ్రిటీ ప్రీమియర్ షో

వరుస హిట్లతో దూసుకుపోతోన్న ప్రియదర్శి ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ అంటూ హిట్టు కొట్టేశాడు. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ‘సారంగపాణి జాతకం’ సినిమాకు మంచి మౌత్ టాక్ వచ్చింది. దీంతో శనివారం నాడు సెలెబ్రిటీల కోసం ప్రత్యేకంగా షోను ఏర్పాటు చేసింది చిత్రయూనిట్. ఈ సెలెబ్రిటీ షోలో ఎం ఎస్ రాజు, హరీష్ శంకర్, సాయి రాజేష్, సుధీర్ బాబు, కోన వెంకట్, ఈషా రెబ్బా, బీవీఎస్ రవి, సినిమా టీం అంతా కూడా సందడి చేశారు. సినిమాను చూసిన అనంతరం..

హరీష్ శంకర్ మాట్లాడుతూ .. ‘‘సారంగపాణి జాతకం’ సినిమా చూసిన తరువాత నాకు జంధ్యాల, ఈవీవీ గారి చిత్రాలు గుర్తుకు వచ్చాయి. ఇంద్రగంటి గారి రైటింగ్ అద్భుతంగా అనిపించింది. ఈ మధ్య కాలంలో ఇంత మంచి చిత్రం రాలేదు. డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. సమ్మర్‌లో నిమ్మసోడ లాంటి ఓ మంచి చిత్రం. హిచ్ కాక్ గారి సినిమాను జంధ్యాల గారు డైరెక్టర్ చేస్తే ఎలా ఉంటుందో.. ‘సారంగపాణి జాతకం’ అలా ఉంటుంది. ప్రియదర్శి, రూపా, వెన్నెల కిషోర్, వైవా హర్ష ఇలా ప్రతీ ఒక్క పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంత మంచి చిత్రాన్ని ఈ మధ్య కాలంలో చూడలేదు. ఇంత మంచి చిత్రాన్ని అందించిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారికి థాంక్స్. ఈ మూవీని ఆడియెన్స్ మరింత సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ .. ‘‘సారంగపాణి జాతకం’ చూస్తే నాకు క్లాసిక్ చిత్రమైన ‘మైఖేల్ మదన కామరాజు’ లాంటి చిత్రం గుర్తుకు వచ్చింది. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడాలి. కడుపుబ్బా నవ్వుకునేలా ఈ సినిమాను గొప్పగా తీశారు. ఇదీ మన సినిమా అనే రేంజ్‌లో ‘సారంగపాణి జాతకం’ ఉంటుంది’ అని అన్నారు.

ఈషా రెబ్బా మాట్లాడుతూ .. ‘‘సారంగపాణి జాతకం’ చూస్తే నవ్వి నవ్వి నా బుగ్గలు కూడా నొప్పి పెట్టాయి. ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చిన ఇంద్రగంటి గారికి థాంక్స్. ఈ చిత్రంలో అందరూ అద్భుతంగా నటించారు. చాలా రోజుల తరువాత మంచి సినిమా చూశాననే ఫీలింగ్ వచ్చింది. ఫ్యామిలీతో వచ్చి హాయిగా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంది’ అని అన్నారు.

కోన వెంకట్ మట్లాడుతూ .. ‘‘సారంగపాణి జాతకం’ సినిమాను ఇప్పుడే చూశాం. జంధ్యాల గారి మార్క్ కనిపించింది. మూవీ అద్భుతంగా ఉంది. ప్రతీ క్షణం, ప్రతీ సీన్‌కు నవ్వుకుంటూనే ఉంటారు. ఇది ఫన్ టాస్టిక్ సినిమా. అందరూ చూసి నవ్వుకుని ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

బీవీఎస్ రవి మాట్లాడుతూ .. ‘చాలా రోజుల తరువాత ఫోన్ చూడకుండా ప్రతీ సీన్, ప్రతీ ఫ్రేమ్‌ను చూశాను. ప్రతీ కారెక్టర్ అద్భుతంగా ఉంది. కడుపుబ్బా నవ్వించేశారు. చాలా రోజులకు మంచి సినిమా చూశాను. ఇంద్రగంటి గారికి కంగ్రాట్స్. అందరూ తప్పకుండా ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.

సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘‘సారంగపాణి జాతకం’ సినిమాను ఇప్పుడే చూశాను. అద్భుతంగా ఉంది. నవ్వి నవ్వి పొట్టచెక్కలవుతుందా? అని అనుకున్నాను. ఈ మధ్య కాలంలో ఇంతగా నవ్వించిన చిత్రమిదే. అందరూ అద్భుతంగా నటించారు. మళ్లీ వెంటనే సినిమాను చూడాలనిపిస్తోంది’ అని అన్నారు.