పేదలకు అన్నం పెట్టిన అభిమానం!!

పెద్ద హీరోల కొత్త సినిమాలకు కటౌట్లు పెట్టిన అభిమానులం చూశాం. పుట్టినరోజు వస్తే రక్తదానం చేసిన అభిమానులం చూశాం. మరికొంత మంది అడుగు ముందుకేసి తమ అభిమాన హీరోల పేర్లను, ఫొటోలను గుండెలపై పచ్చబొట్టు వేయించుకోవడం చూశాం. కానీ తొలిసారిగా టాలీవుడ్ లో ఓ అభిమాని వాటిన్నికంటే విభిన్నమైన పని చేసి ప్రత్యేకత చాటుకున్నాడు.

తాను ఎంతగానో ఆదరించే అగ్ర కథానాయిక సమంత పుట్టినరోజును పురస్కరించుకొని సుమారు 100 మందికి పైగా నిరుపేదలకు ఓ పూట భోజనం పెట్టి తన హీరోయిన్ పై ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నాడు. ఓ టెలివిజన్ ఛానల్ లో కెమెరామెన్ గా పనిచేస్తున్న చరణ్ తేజకు సమంత అంటే ఎనలేని అభిమానం. సామ్ సినిమా వచ్చిందంటే చరణ్ కు పండుగే. సామ్ సినిమాలు, వ్యక్తిగతంగా ఎలాంటి అప్డేట్ వచ్చినా చరణ్ కు అంతులేని ఆనందాన్నిస్తాయి.

ఈ క్రమంలో నేడు(ఏప్రిల్28) సమంత పుట్టినరోజును సరికొత్తగా జరుపుకోవాలని భావించిన చరణ్ … కరోనా పరిస్థితుల్లో చాలా మంది నిరుపేదలకు భోజనం దొరకడం లేదని గ్రహించాడు. బసవతారకం ఆస్పత్రి వద్ద పుట్ పాత్ పై ఆకలితో అలమటిస్తున్న సుమారు 100 మందికి పైగా తన సొంత డబ్బులతో భోజనం అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు.

సినిమాల్లో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల ఆకలి తీర్చే తన అభిమాన హీరోయిన్ కు నిజమైన బహుమతిగా పేదల ఆకలి తీర్చి శభాష్ అనిపించుకున్నాడు. ఈ అభిమాని చేసిన గొప్ప పనికి సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.