బిగ్‌బాస్-14 టాలెంట్ మేనేజ‌ర్ రోడ్డు ప్ర‌మాదంలో మృతి!

బాలీవుడ్ భాయిజాన్‌ సల్మాన్ ఖాన్ రియాలిటీ షో బిగ్ బాస్-14 టాలెంట్ మేనేజర్ పిస్తా ధాకద్(23) రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించింది. షూటింగ్ ముగిసిన త‌ర్వాత ఇంటికి వెళ్తున్న క్ర‌మంలో ప్ర‌మాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా తాజా బిగ్‌బాస్ సీజ‌న్‌కు పిస్తా ధాక‌ద్ టాలెంట్ మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం వీకెండ్ కా వార్ ఎపిసోడ్ ముగించుకుని తన అసిస్టెంట్‌తో క‌లిసి స్కూటీ మీద ఇంటికి బ‌య‌లుదేరే క్ర‌మంలో వాహ‌నం అదుపుత‌ప్పి ఇద్ద‌రు కింద‌ప‌డ్డారు.

ఇంత‌లో అటుగా వ‌స్తున్న ఓ వ్యాన్ పిస్తా ధాక‌ద్ మీద నుంచి దూసుకెళ్ల‌డంతో ఆమె అక్క‌డికక్క‌డే మృతి చెందింది. కాగా పిస్తా ధాక‌ద్ ఆక‌స్మిక మ‌ర‌ణం ప‌ట్ల‌.. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ల్‌ షెహ్నాజ్ గిల్, హిమాన్షి ఖురానా, కామ్యా పంజాబీ, యువికా చౌదరి ఆమెకు సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ చివరి సీజన్లో కంటెస్టెంట్‌గా కనిపించిన హిమాన్షి.. హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో పిస్తా ధాకాడ్ చిత్రాన్ని పంచుకుని ఇలా రాసింది. “ఆర్‌ఐపి పిస్తా … ఆమె మరణ వార్త తెలిసింది … ఇంకా షాక్‌లోనే ఉన్నా … జీవితం అనిశ్చితం. పిఎస్. బిగ్ బాస్ టాలెంట్ మేనేజర్. అంటూ నివాళుల‌ర్పించింది. అలాగే మ‌రో బిగ్‌బాస్ కంటెస్టెంట్ న‌టి యువికా చౌద‌రి.. ఇంత త్వ‌ర‌గా మ‌మ్మ‌ల్ని విడిచి వెళ్లిపోయావు ఎందుకు.. నీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని నేను ప్రార్థిస్తున్నానంటే ఇంకా న‌మ్మ‌లేక‌పోతున్నా అంటూ భావోద్వేగానికి లోన‌య్యింది.