సాయి చంద్ రెండేళ్ల కష్టానికి ఫలితం ఇది

సైరా మూవీ అనగానే ఠక్కున గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు అద్భుతాలే సృష్టించాడు. 64 ఏళ్ల వయసులో కూడా యుద్ధ వీరుడిగా కనిపించిన చిరంజీవి, క్లైమాక్స్ లో ఎమోషనల్ యాక్టింగ్ తో అదరగొట్టారు. ఈ సినిమాని చూసి బయటకి వచ్చిన వారికి చిరుతో లక్ష్మీ పాత్రలో నటించిన తమన్నాకి, అవుకు రాజా పాత్రలో నటించిన కిచ్చా సుదీప్ కి కూడా మంచి పేరొచ్చింది. ముఖ్యంగా తమన్నా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని అంతా అంటున్నారు. ఈ ముగ్గురితో పాటు సైరా సినిమాలో అద్భుతంగా నటించిన వారి గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా సాయిచంద్ గురించే మాట్లాడుకోవాలి.

ఇంతకీ ఈ సాయి చంద్ ఎవరూ అని ఆలోచిస్తున్నారా? ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫాదర్ పాత్రలో కనిపించిన వ్యక్తి గుర్తున్నాడా, అతనే సాయి చంద్. సైరా సినిమాలో సిద్దయ్య పాత్రలో నటించాడు కాదు కాదు జీవించాడు. రైతుగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వెనక తిరిగే తిరుగుబాటు దారుడిగా కనిపించిన సాయి చంద్, సైరా సినిమాకి ప్రాణం పోశారు. నరసింహారెడ్డి పక్కన ఏ పాలెగాడు నిలబడని సమయంలో, ఆయనకి అండగా నిలుస్తూ సిద్దయ్య పాత్రలో సాయి చంద్ చెప్పిన డైలాగులు థియేటర్స్ లో విజిల్స్ వేయించింది. గూస్ బంప్స్ తెప్పించిన ఈ సీన్ సైరాకే హైలైట్ అయ్యింది. సిద్దయ్య పాత్ర చనిపోయే సీన్ లో కూడా చావు అంటే ఇదిరా అంటూ సాయిచంద్ చెప్పిన డైలాగులు సినిమాహాల్లో అందరినీ ఓ ఎమోషనల్ ఫీల్ లోకి తీసుకువెళ్తాయి. ఇంత మంచి పాత్రలో కనిపించిన సాయి చంద్, 1980లో మొదటిసారి మా భూమి సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత ఈ చరిత్ర ఏ సిరాతో, ఈ చదువులు మాకొద్దు, ఈ దేశంలో ఒక రోజు, శివ లాంటి మంచి సినిమాల్లో కీ రోల్ ప్లే చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

చివరగా 1989లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన సాయి చంద్, ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్నారు. మళ్లీ సాయి చంద్ లోని నటుడిని బయటకి తెచ్చి మంచి పాత్ర చేయించిన క్రెడిట్ శేఖర్ కమ్ములకే దక్కుతుంది. ఫిదా మూవీలో మంచి పాత్రలో కనిపించిన సాయి చంద్ ని సైరాలో చూసిన తర్వాత తెలుగులో సపోర్టివ్ రోల్స్ చేయడానికి ఒక కొత్త ఆర్టిస్ట్ దొరికాడని అనుకుంటున్నారు. నిజానికి సాయి చంద్ చిరుతో నటించడం ఇదే మొదటిసారి కాదు, 1892లో చిరు సుహాసిని నటించిన మంచు పల్లకి సినిమాలో కూడా కనిపించాడు. సిద్దయ్య పాత్రకి రెండేళ్ల పాటు డెడికేటెడ్ గా పని చేసిన సాయి చంద్ తో ఫ్యూచర్ లో ఏ డైరెక్టర్ మంచి పాత్ర చేయిస్తాడో చూడాలి.