సుజిత్ మూడో సినిమా ఆ హీరోతోనే… హిట్ ఇస్తాడా?

రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహూ అనిపించిన యంగ్ డైరెక్టర్, రెండో సినిమాకే పాన్ ఇండియా లెవల్లో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. టాక్ తో సంబంధం లేకుండా కాసుల వర్షం కురిపించిన సాహూ సినిమా తర్వాత ప్రభాస్, జాన్ తో బిజీ అవనున్నాడు. సుజిత్ కూడా సాహూ నుంచి బయటకి వచ్చి కొత్త సినిమా మొదలుపెట్టడానికి ప్రణాళిక రచిస్తున్నాడు. మొదటి సినిమా రన్ రాజా రన్ తోనే మెప్పించిన సుజిత్, శర్వానంద్ ని చాలా కొత్తగా చూపించాడు. సీరియస్ రోల్స్ చేసే శర్వా ఇంత యాక్టివ్ గా ఉంటాడా అనిపించేలా, సుజిత్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు.

సుజిత్ ఇప్పుడు మూడో సినిమా కూడా శర్వానంద్ తోనే చేయడానికి రెడీ అవుతున్నాడు. హిట్ కాంబినేషన్ కావడం, ఇద్దరికీ అర్జెంటుగా హిట్ కావాల్సి ఉండడంతో కసితో పని చేసే అవకాశం ఉంది. త్వరలోనే సుజిత్, శర్వాకి కథ చెప్పబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం శర్వానంద్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో 96 ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకోగా, మిగిలిన రెండు చిత్రాలు సెట్స్ పైన ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత శర్వానంద్, సుజిత్ సినిమా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది.