అంతరిక్షం పై సినిమా, అంతరిక్షంలోని షూటింగ్…

అంతరిక్షం ఎప్పుడూ కొత్తగా కనిపిస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ఎదో ఒక విషయాన్ని అది చూపిస్తూనే ఉంటుంది. అందుకే మూవీ మేకర్స్ తన ఇంటెలిజెన్స్ ని క్రియేటివ్ నాలెడ్జ్ ని అంతరిక్షంపై ఆవిష్కరిస్తూ ఉంటారు. అరైవల్, ఇంటర్ స్టెల్లార్, స్పేస్ ఒడిస్సి, గ్రావిటీ, ఫస్ట్ మ్యాన్, అపోలో 13 ఇలా చెప్పుకుంటూ పోతే హాలీవుడ్ లో స్పేస్ పైన వచ్చే సినిమాలు ఎన్నో. తెలుగులో కూడా వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్షం అనే టైటిల్ తో ఒక మూవీ వచ్చింది. అయితే ఇవన్నీ భూమి పైనే ఒక సెట్ వేసి, గ్రీన్ మ్యాట్ లో తెరకెక్కించిన చిత్రాలు… నిజంగా స్పేస్ కాన్సెప్ట్ తో అంతరిక్షంలో షూటింగ్ చేస్తే ఎలా ఉంటుంది? అసలు ఎవరైనా ఇలాంటి ఆలోచన చేస్తారా? అంతటి సాహసం చేయగలరా? ఈ సాహసాన్ని చేయడానికే రష్యా రెడీ అవుతోంది. ఛాలెంజ్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో రష్యన్ నటి యూలియా పేరెసిల్డ్ తో పాటు నటుడు, దర్శకుడు క్లిమ్ పేషేంకో నటించనున్నారు.

అన్నీ అనుకున్నట్లే జరిగితే ఈ అక్టోబరులో రష్యన్‌ రాకెట్‌ ద్వారా ఈ సినిమాని లాంచ్‌ చేస్తారట. ఈలోపు మెయిన్ కాస్ట్ కి జీరో గ్రావిటీ ఉన్నప్పుడు విమానాన్ని నడపడం, ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో కిందకు దిగడం వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే టామ్ క్రూజ్ తో అంతరిక్షంలో ఒక మూవీ చేస్తున్నామని నాసా ప్రకటించింది. దీనికోసం అమెరికన్ ఏజెన్సీ కూడా రెడీ అవుతోంది. ఈ లోపు వారికి షాక్ ఇస్తూ రష్యన్ ఏజెన్సీ అంతరిక్షంలో షూట్ చేయబోతోంది. మరి ఆ సాహసం ఎన్ని సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి.