శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఆర్‌యు రెడ్డి చిత్రం

సోనుధి ఫిలిమ్‌ ఫ్యాక్టరీ అధినేత ఆర్‌.యు రెడ్డి అన్నమాట ప్రకారం తాను ప్రారంభించిన ప్రొడక్షన్‌ నం1 సినిమా దిగ్విజయంగా షూటింగ్‌ పూర్తి చేసుకుందన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ–‘‘ ఇదొక కొత్త రకమైన సినిమా. అనేక ఎమోషన్స్‌ కలగలిసిన కథ. మంచి కథ కావటంతో మా నటీనటులు ఆశిష్‌గాంధీ, మానస రాధాకృష్ణన్‌ల నుండి ఎంతో చక్కని సహకారం లభించటంతో సినిమాను అనుకున్న సమయానికి షూటింగ్‌ పూర్తి చేయగలిగాం. మా దర్శకులు కిరణ్‌ కిట్టి, లక్ష్మీ చైతన్యలు కొత్తవారైనా చెప్పిన కథను చెప్పినట్లు తెరకెక్కించారు. ఒక్క పాట మినహా షూటింగ్‌ పార్టంతా పూర్తయింది. ఆ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ చేయనున్నారు. త్వరలోనే సినిమా టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేస్తాం. సినిమాను రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. ప్రముఖ సంగీత దర్శకుడు గోపిసుందర్‌ అందించిన ఆరు పాటలు మా సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. మా బ్యానర్‌నుండి మరికొన్ని సినిమాలు ఈ ఏడాదిలో ప్రారంభిస్తాం’’ అన్నారు.