‘RRR’ నుంచి మరో క్రేజీ వీడియో

టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాకు సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఇటీవల RRR టీమ్ ఒక వీడియోను కూడా విడుదల చేసింది.

అలాగే తారక్ కొమురం భీమ్‌కు సంబంధించి టీజర్‌ను కూడా సినిమా యూనిట్ విడుదల చేయగా.. ఇది సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ స‌ృష్టించింది. రాంచరణ్ దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వగా.. యూట్యూబ్‌లో ఈ టీజర్ రికార్డులు సృష్టించింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో RRR సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ప్రత్యేక సెట్‌లో ఓ భారీ యాక్షన్ సీన్‌ను తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా RRR సినిమా యూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది ఈ సన్నివేశం ఎలా ఉండబోతోందో మీ ఊహకే వదిలేస్తున్నాం అని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.