బాలీవుడ్ లో జెండా ఎగరేయనున్న కామ్రేడ్?

అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ అయిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రీసెంట్ గా డియర్ కామ్రేడ్ సినిమాతో సౌత్ పై కన్నేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఈ మూవీ రిజల్ట్ తేడా కొట్టినా విజయ్ మార్కెట్ కి ఎలాంటి ఢోకా రాలేదు, పైగా బాలీవుడ్ లో అతని మార్కెట్ కి కొత్త తలుపులు తెరుచుకుంటున్నాయి. అర్జున్ రెడ్డి చూసినప్పుడే విజయ్ యాక్టింగ్ కి ఫిదా అయిన బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, డియర్ కామ్రేడ్ సినిమా ప్రొమోషన్స్ సమయంలో కూడా విజయ్ కి అండగా నిలిచాడు. డియర్ కామ్రేడ్ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్న కరణ్ జోహార్, ఈ మూవీతో విజయ్ దేవరకొండని నార్త్ ఆడియన్స్ కి పరిచయం చేయాలని చూస్తున్నాడట.

కరణ్ జోహార్ తో పాటు, మరో ఇద్దరు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ సిద్దార్థ్ రాయ్ కపూర్, సాజిద్ నడియాడ్‌వాలా కూడా డియర్ కామ్రేడ్ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారట. భారీ సినిమాలకి కెరాఫ్ అడ్రస్ గా నిలిచే ఈ ముగ్గురి ప్రొడ్యూసర్స్ చేతిలో పడితే విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో పాగా వేయడం పెద్ద కష్టమేమి కాదు. తాజాగా వస్తున్న సమాచారాన్ని బట్టి డియర్ కామ్రేడ్ హిందీ వెర్షన్ సినిమా సెప్టెంబరు 6న గ్రాండ్ గా లాంచ్ కాబోతుందట. అయితే డియర్ కామ్రేడ్ సినిమా హిందీలో రీమేక్ అవ్వడం నిజమే కానీ అందులో తాను నటించట్లేదని విజయ్ దేవరకొండ గతంలో స్పష్టం చేశాడు. మరి ముగ్గురు బడా నిర్మాతల కలయికలో సెప్టెంబర్ 6న మొదలు కానున్న ఈ సినిమా డియర్ కామ్రేడ్ కి రీమేకా లేక కొత్త కథా అన్నది చూడాలి.