సౌత్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టిన ‘రౌడీబేబీ’ సాంగ్

తమిళంలో సాయిపల్లవి-ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మారి-2’ సినిమాలోని ‘రౌడీ బేబీ’ అనే సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఆ పాట యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్‌ను సంపాదించుకుంది. దీంతో యూట్యూబ్‌లో 100 కోట్ల వ్యూస్‌ను దాటిన తొలి సౌత్ ఇండియన్ పాటగా నిలిచింది.

rowdy baby

100 కోట్ల వ్యూస్‌ రావడం అంటే మాములు విషయం కాదని, ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతున్నట్లు హీరో ధనుష్ ఈ సందర్భంగా ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. 100 కోట్ల వ్యూస్ దాటిన తొలి సౌత్ ఇండియన్ పాటగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉందన్నాడు.

‘మారి 2’ సినిమా 2018 డిసెంబర్‌లో విడుదల అయినప్పటికీ.. 2019 జనవరిలో 2వ తేదీన రౌడీబేబీ పాటను యూట్యూబ్‌లో పెట్టారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. యువన్ శంకర్ రాజా ఈ పాటకు సంగీతం అందించారు. గతంలో ధనుష్-అనిరుధ్ కాంబోలో వచ్చిన ‘వై దిస్ కొలవరీ’ సాంగ్ రికార్డులు సృష్టించగా.. ఇప్పుడు ధనుష్ సినిమాలోని రౌడీబేబీ పాట అంతకంటే పెద్ద రికార్డులు సృష్టించింది.