ZEE5లో స్ట్రీమింగ్‌ కానున్న ‘రాబిన్‌హుడ్‌’

డైన‌మిక్ స్టార్ నితిన్ హీరోగా బ్రిలియంట్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ ప్యాక్డ్ థ్రిల్ల‌ర్ ‘రాబిన్‌హుడ్’ మే10 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం ZEE5లో స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమాను ఓటీటీలో చూసి ఉర్రూత‌లూగించే సాహ‌సానికి సిద్ధం కావాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం స‌స్పెన్స్‌, ట్విస్ట్స్‌, ఎవ‌రూ ఊహించ‌లేని మ‌లుపుల‌తో సాగే క‌థ‌నంతో ఆక‌ట్టుకుంటుంది. రాబిన్‌హుడ్ చిత్రం నేరానికి అధికారం తోడైతే ఎంత శ‌క్తివంతంగా ఉంటుందో ఆ శ‌క్తిని తెలియ‌జేసే నేర ప్ర‌పంచానికి ప్రేక్ష‌కుల‌ను స‌రికొత్త‌గా తీసుకెళుతుంది. సినిమాలో ప్ర‌ముఖ న‌టీన‌టులంద‌రూ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సినిమా చూసే ప్రేక్ష‌కులు ఉహించ‌లేని గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో సాగే ఈ చిత్రంలో ప్రేక్ష‌కులు కోరుకునే హై ఓల్టేజ్ యాక్ష‌న్ కూడా ఉంటుంది. ఈ చిత్రం మే 10 నుండి జీ తెలుగు శాటిలైట్ మరియు ZEE5 తమిళ్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.

రాబిన్‌హుడ్ చిత్రం సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ఆడియెన్స్‌ను అలరిస్తుంది. క‌థ విష‌యానికి వ‌స్తే.. రామ్ (నితిన్‌) ఓ అనాథ‌, తెలివైన యువ‌కుడు. కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా త‌నొక రాబిన్‌హుడ్‌గా మారి ధ‌న‌వంతుల నుంచి డ‌బ్బ‌ను దొంగిలించి అవ‌స‌ర‌మైన వారికి సాయం చేస్తుంటాడు. అనుకోకుండా అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ సామ్రాజ్యానికి రాజ‌మైన వ్య‌క్తితో త‌ల‌ప‌డాల్సి వ‌స్తుంది. అక్క‌డి నుంచి రామ్ క‌థ ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపు తీసుకుంటుంది. త‌ను నీరా (శ్రీలీల‌)తో క‌లిసి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన దొంగ‌త‌నాలు, ప్రాణాంత‌క‌మైన స‌వాళ్ల‌ను ఎదుర్కొన‌టానికి సిద్ధ‌మ‌వుతాడు. అంతా బాగుంద‌ని భావిస్తున్న త‌రుణంలో క‌థ అతి పెద్ద ట్విస్ట్ తిరుగుతుంది. అప్పుడు రామ్‌, నీరా ఏం చేశారు? స‌మ‌స్య నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? అనే ట్విస్ట్ ఏంటి? అనే అంశాలు ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఉత్కంఠ‌త‌కు లోను చేస్తాయి.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘‘రాబిన్‌హుడ్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌టం ఎంతో హ్యాపీగా ఉంది. థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు  ZEE5 ద్వారా అల‌రించ‌నుంది. హై వోల్టేజ్ యాక్ష‌న్‌, స‌స్పెన్స్‌, ఎమోష‌న్స్‌తో క‌థ‌ను తయారు చేశాను. దీనికి హీరో నితిన్ త‌న‌దైన న‌ట‌న‌తో ప్రాణం పోశాడు. త‌న నిబ‌ద్ధ‌త‌తో పూర్తిస్థాయి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ ప్రయాణంలో ఇప్పుడు  ZEE5 క‌లిసి రావ‌టం ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఉంది. భ‌విష్య‌త్తులో ఇలాంటి భాగ‌స్వామ్యాల‌తో మ‌రిన్ని సినిమాల‌ను చేయాల‌నుకుంటున్నాను. కేవ‌లం దొంగ‌త‌నాలు, ఎమోష‌న్స్‌, నాట‌కీయ‌త‌కు సంబంధించిన క‌థ మాత్ర‌మే కాదు. స‌మాజంలో జ‌రిగే త‌ప్పుల‌ను సరిదిద్ద‌టానికి ఓ బాట‌ను ఎంచుకున్న మ‌నిషి గురించి క‌థ‌. ఉత్కంఠ‌త‌తో సాగే ఈ సినిమాను జీ5లో ప్రేక్ష‌కులు ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాల‌ని ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

హీరో నితిన్ మాట్లాడుతూ ‘‘రాబిన్‌హుడ్ ఓ సాధార‌ణ‌మైన హీరో కాదు.. తెలివైనవాడు.. ఎలాంటి భ‌యంలేనివాడు, స‌మాజంలో త‌ప్పుల‌ను స‌రిదిద్ద‌టానికి ఎంత దూర‌మైనా వెళ్లే వ్య‌క్తి. ఆధునిక రాబిన్‌హుడ్‌గా ధ‌న‌వంతుల నుంచి దొంగ‌త‌నం చేసి పేద‌వారికి సాయం చేసే పాత్రలో న‌టించటం ఓ కొత్త అనుభ‌వాన్నిచ్చింది. ఈ జ‌ర్నీ ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇప్పుడు జీ5 ప్రేక్ష‌కులను ఈ సినిమా ఎలా ఆక‌ట్టుకుంటుందో చూడాల‌ని ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నాను. యాక్ష‌న్‌, డ్రామా, ఊహించ‌ని ట్విస్ట్‌ల‌తో రోల‌ర్‌కోస్ట‌ర్‌లా అంద‌రినీ అల‌రిస్తుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా రాబిన్‌హుడ్ మెప్పిస్తుంది’’ అన్నారు.

హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ ‘‘రాబిన్‌హుడ్ చిత్రంలో  తెలివైన‌, ధైర్య‌వంతురాలైన‌, స‌వాళ్ల‌ను స్వీక‌రించే నీరా అనే అమ్మాయి పాత్ర‌లో న‌టించాను. నా పాత్ర‌లో చాలా కోణాలున్నాయి. నితిన్‌తో క‌లిసి న‌టించ‌టం అద్భుతం. నితిన్ పాత్ర‌ను డిజైన్ చేసిన తీరు, తెర‌కెక్కించిన విధానం సూప‌ర్బ్‌. త‌ను రాబిన్‌హుడ్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల‌తో క‌లిసి సినిమా చేయ‌టం అనే క‌ల ఈ చిత్రంతో నేర‌వేరింది. ఆయ‌న విజ‌న్ మా అంద‌రిలో బెస్ట్ ఔట్‌పుట్ తీసుకొచ్చింది. క‌థ‌లో యాక్ష‌న్‌, ఎమోష‌న్స్‌, కామెడీ వంటి అంశాల‌ను సినిమాగా మ‌లిచిన తీరు చాలా చ‌క్క‌గా ఉంది.  థియేట‌ర్స్‌లో అల‌రించిన ఈ సినిమా ఇప్పుడు జీ5లో ప్రేక్ష‌కుల‌ను అలరించ‌టానికి సిద్ధ‌మవుతుంది. ఊహించ‌ని ట్విస్టుల‌తో, మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచే క‌థతో సినిమా తెరకెక్కింది. ప్రేక్ష‌కులు సినిమాను త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు. ఈ అద్భుత‌మైన ప్ర‌యాణంలో భాగం కావ‌టం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు.