ఈ యుద్ధంలో గెలిచేదెవరు?

తెలుగువారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే కోడి పందాలతో పాటు సినిమాల మధ్య పోరు కూడా జరుగుతోంది. సంక్రాంతి వచ్చిందంటేనే.. నాలుగైదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడతాయి. సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తారు. ఎందుకంటే సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తే.. హిట్ అవుతుందనే సెంటిమెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉంది. సంక్రాంతికి విడుదల చేస్తే.. అన్నీ కలిసి వస్తాయని నమ్ముతారు.

ఈ సంక్రాంతి రోజున ఏకంగా రెండు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఒకటి యంగ్ అండ్ డైనమిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన అల్లుడు అదుర్స్ సినిమా కాగా.. మరొకటి ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమా. ఈ రెండు సినిమాలు సంక్రాంతి రోజైన జనవరి 14న విడుదల కానున్నాయి. ఒకే రోజు రెండు సినిమాలు విడుదల అవుతుండటంతో.. సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోలు, వారిద్దరి తండ్రుల మధ్య అంతర్యుద్ధం జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దానికి కారణం లేకపోలేదు. అల్లుడు అదుర్స్ సినిమాను జనవరి 15న విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ముందుగా ప్రకటించింది. కానీ అనూహ్యంగా డేట్‌ను మార్చడం అనుమానాలకు దారితీస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ గతంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన కందిరీగ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమా డైరెక్టర్ అయిన సంతోష్ శ్రీనివాస్ దీనికి దర్శకత్వం వహించాడు. ఇక రామ్ పోతినేని హీరోగా వస్తున్న రెడ్ సినిమాను శ్రీ శ్రవంతి మూవీస్ బ్యానర్‌పై కిషోర్ తిరుమల తెరకెక్కించగా.. రవి కిషోర్ పోతినేని నిర్మించారు. రవి కిషోర్ పోతినేని రామ్‌కు పెద్దనాన్న.

మాములుగా ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేరోజు విడుదల కావు. కానీ ఒకేరోజు విడుదల చేస్తుండటంతో.. బెల్లంకొండ సురేష్, రవి కిషోర్ మధ్య అంతర్యుద్ధం జరుగుతుందా? అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. ఇక ఛత్రపతి రీమేక్‌లో బాలీవుడ్‌లోకి కూడా బెల్లంకొండ సురేష్ అడుగుపెట్టబోతున్నాడు. రామ్ రెడ్ సినిమా ఏకంగా ఏడు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ తరుణంలో శ్రీనివాస్, రామ్ మధ్య భారీ పోటీ నెలకొంది. దీంతో రామ్‌కు పోటీగా నిలిచేందుకు సాయి శ్రీనివాస్ ఈ డెషిషన్ తీసుకున్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోలు, ఇద్దరి తండ్రుల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.