ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్’. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డులు సృష్టించిందీ సినిమా. మాస్ మసాలా ఎంటర్టైనర్లో ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్నాలజీ మిళితం చేయడం పూరికి మాత్రమే చెల్లింది.
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో హీరో రామ్ మెదడులో బ్రెయిన్ చిప్ ఇంప్లాంట్ చేస్తారు. అది సినిమా. దానిని నిజం చేయబోతున్నారు ఎలన్ మస్క్. ఆల్రెడీ రియల్ లైఫ్ ‘ఇస్మార్ శంకర్’ ఒకరిని రెడీ చేశారు. ఎర్లీ రిజల్ట్స్ పాజిటివ్ అని చెప్పారు.
ఎలన్ మస్క్ ఓ వ్యవస్థాపకుడిగా ఉన్న న్యూరోలింక్ కంపెనీ మనిషి మెదడులో ఒక వైర్ లెస్ చిప్ అమర్చింది. సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆ ప్రయోగం అనంతరం మెదడు కార్యకలాపాలు గుర్తించామని, పేషెంట్ కోలుకున్నారని మస్క్ ట్వీట్ చేశారు. మన మెదడును కంప్యూటర్లకు కనెక్ట్ చేసి నరాల సంబంధిత సమస్యలను పరిష్కరించాలనేది తమ లక్ష్యం అని ఆయన చెప్పారు. క్లుప్తంగా చెప్పాలంటే… ఈ ప్రయోగం అంతటినీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో రామ్, పూరి జగన్నాథ్ చాలా చక్కగా వివరించారు.
‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్, పూరి నమ్మిన కథను ఎలన్ మస్క్ నిజం చేయడం, నిజ జీవితంలో ప్రయోగాలకు శ్రీకారం చుట్టడం ఆసక్తికరంగా ఉంది కదూ! మనిషి మెదడులో చిప్ అమర్చడం అనేది కలలో కూడా ఊహించడానికి కష్టం అనే బ్రమ ఇన్నాళ్లు ఉండేది. ఇప్పుడు అది నిజం అయ్యింది. భవిష్యత్తులో ఇంకెన్ని ప్రయోగాలు వస్తాయో చూడాలి.
ఇప్పుడు హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నారు. ఆ సినిమా కథ కూడా ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్నాలజీ మీద ఉంటుందని తెలిసింది. ఆ సినిమా విడుదల అయ్యాక దానిపై కూడా ఈ విధంగా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ చేస్తున్న రామ్, పూరి జగన్నాథ్… త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.