‘సైకో వర్మ’ పై స్పందించిన వర్మ!! వర్మతో నాకు ఎలాంటి గొడవల్లేవు: నట్టికుమార్?

సినిమా అనేది ఓ స్పృజనాత్మక కళ. ఆ ప్రక్రియలో భాగంగానే కథకు తగ్గట్టుగా సైకో వర్మ టైటిల్ తో పాటు అందులోని పాట పుట్టింది తప్ప కేవలం నన్ను తిట్టాలన్న ఉద్దేశ్యం కాదు అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. వాస్తవానికి నట్టి కుమార్, నేను స్నేహితులం మాత్రమే కాదు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. వారితో కలిసి నేను సినిమాలు చేస్తున్నా కూడా. కొందరు మా మధ్య విబేధాలు వచ్చాయని ఊహాగానాలు చేస్తున్నారు కానీ అది నిజం కాదు. ఇక సైకో వర్మ పాటకు అశేష ప్రేక్షక ఆదరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది అని వర్మ వివరించారు.

వర్మతో నాకు ఎలాంటి గొడవల్లేవు: నిర్మాత నట్టికుమార్

వర్మకు, నాకూ మధ్య విబేధాలు తలెత్తాయని కొందరు అపోహ చెందుతున్నారు. అయితే అవి వాస్తవాలు కాదు. మేమిద్దరం మంచి స్నేహితులం. కొన్ని సినిమాలను కలసి చేసాం, మరికొన్ని సినిమాలను కలసి చేయబోతున్నాం కూడా అని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ స్పష్టం చేశారు.

నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నట్టి క్రాంతి సమర్పణలో నిర్మాతలు నట్టి కరుణ, అనురాగ్ కంచర్ల సంయుక్తంగా ‘సైకో వర్మ’ (వీడు తేడా) పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి నట్టి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం టైటిల్ తో పాటు తాజాగా విడుదల చేసిన ”పిచ్చోడి చేతిలో రాయి ”సైకో వర్మ”నే మన భాయి” అంటూ సాగే లిరికల్ సాంగ్ విశేషమైన స్పందనతో ట్రెండింగ్ లో వుంది. ఈ నేపథ్యంలో టైటిల్ తో పాటు లిరికల్ సాంగ్ చూసిన ప్రేక్షకులు, అభిమానులు అధిక శాతం తమ మధ్య గొడవలు వచ్చాయని అపోహ చెందుతున్నారు. కానీ మా మధ్య పటిష్టమైన స్నేహబంధం వుంది. వర్మకు సినిమానే శ్వాస, ధ్యాస. సంచలనాలకు మారు పేరైన వర్మ కరోనా టైమ్ లో కూడా అత్యధిక సినిమాలు చేశారు..చేస్తున్నారు కూడా. ప్రస్తుతం ఏడు సినిమాలతో క్షణం తీరికలేనంతగా ఆయన బిజీగా వున్నారు. సైకో అంటే పిచ్చి. వర్మ సినిమా పిచ్చోడు కాబట్టి ఆ ఆర్ధాన్ని అన్వయించేలా ఈ టైటిల్ పెట్టాం. అలాగే ఓ క్రియేటివిటీ దర్శకుడిగా ఆయన సినిమా ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ…ఆయన మనస్తత్వాన్ని ఆ పాటలో ప్రతిబింబింప చేసాం తప్ప వర్మ పట్ల వ్యతిరేకతతో మాత్రం కాదు అని నట్టి కుమార్ వివరించారు.

ఇక సెప్టెంబర్ 9న ఈ చిత్రం షూటింగును ప్రారంభించి…నిరవధికంగా చేస్తామని, ఇప్పుడొస్తున్న చిత్రాలకు మాత్రం భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని గట్టిగా చెప్పగలం. అయితే కథ అంశాన్ని ఇప్పుడే చెప్పదలచుకోలేదు. ఆర్టిస్టులతో పాటు మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తాం అని నట్టికుమార్ తెలిపారు.