‘బంగారు’ మనసు చాటుకున్న రామ్ చరణ్

ఆర్ఆర్ఆర్  సినిమా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా  ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కనిపిస్తుంది. ఉత్తరాదిన ఊహించని స్పందన రావడం, అక్కడ వసూళ్లు మరింత స్ట్రాంగ్‌గా ఉండటంతో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు దూసుకుపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆర్ఆర్ఆర్ కొత్తకొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో ఒకపక్క హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సహా సినిమాలో భాగమైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచి తనాన్ని చాటుకున్నారు. సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించారు. సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించారు. వారితో కాస్త సమయం గడిపిన రామ్ చరణ్ అనంతరం వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం బంగారం కాయిన్ కానుకగా ఇవ్వడమే కాక వారికి ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్ చరణ్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సందర్భంగా రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు.