రెండు దశాబ్దాలు మారాయి కానీ రజినీ అలానే ఉన్నాడు…

గత ఇరవై నాలుగు గంటలుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న విషయం దర్బార్. సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ కలయికలో వస్తున్న ఈ సినిమా నుంచి సెకండ్ లుక్ బయటకి వస్తుంది అనే వార్త రాగానే ట్విట్టర్ షేక్ అయ్యింది. నేషనల్ వైడ్ ట్రెండ్ అయిన దర్బార్ సెకండ్ లుక్ పోస్టర్ లో రజినీకాంత్ సూపర్బ్ గా ఉన్నాడు. ఏజ్ తనకో నంబర్ మాత్రమే అని మరోసారి ప్రూవ్ చేసిన రజినీ, దర్బార్ సెకండ్ లుక్ పోస్టర్ లో ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయిన నరసింహ సినిమా క్లైమాక్స్ ని గుర్తు చేశాడు. యాక్షన్ ఎపిసోడ్ నుంచి కట్ చేసి డిజైన్ చేసిన పోస్టర్, తలైవా అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టింది.

కేఎస్ రవికుమార్ తెరకెక్కించిన నరసింహా సినిమా క్లైమాక్స్ లో రజినీకాంత్ షర్ట్ విప్పి ఫైట్ చేసే సీన్ ఉంటుంది, అప్పట్లో థియేటర్స్ లో విజిల్స్ వేయించిన ఈ ఫైట్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రెండు దశాబ్దాల క్రితం జ్ఞాపకాలని మళ్లీ గుర్తు చేస్తూ వచ్చిన పోస్టర్ దర్బార్ సినిమాకి కొత్త హైప్ క్రియేట్ చేసింది. రజినీకాంత్ పక్కన నయనతార నటిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. పోస్టర్స్ తో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న దర్బార్ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ఆకాశాన్ని తాకే అంచనాలున్న ఈ ప్రాజెక్ట్ కి పోటీగా సంక్రాంతికి మరో సినిమా వస్తుందా అంటే అనుమానమనే చెప్పాలి.