71వ ఏడాదిలోకి రజనీ.. ఈ బర్త్ డే ఆయనకు మరింత స్పెషల్

సూపర్ స్టార్ రజనీకాంత్ నేటితో 70 ఏళ్లు పూర్తి చేసుకుని 71వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నారు. డిసెంబర్ 12వ తేదీ వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులకు పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. ఆయన బర్త్ డే కావడంతో కేక్ లు కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన ఇండియాలో రజనీకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో రజనీకి అభిమానులు ఉన్నారు. రజనీ సినిమాల కోసం అన్ని భాషల అభిమానులు చూస్తారు. రజనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు అన్ని భాషల్లో ఆయన సినిమాలను డబ్ చేస్తారు.

rajanikanth

ఇక రజనీ స్ట్రైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన స్ట్రైల్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. పెద్ద పెద్ద స్టార్లు కూడా రజనీని అభిమానిస్తారనే విషయం తెలిసిందే. ఇవాళ రజనీ బర్త్ డే కావడంతో సెలబ్రెటీలు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

అయితే ఈ బర్త్ డే రజనీకి మరింత స్పెషల్‌ కానుంది. ఎందుకంటే ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. డిసెంబర్ 31న రాజకీయ పార్టీ గురించి ప్రకటన చేస్తానని, జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఎప్పటినుంచో ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు రజనీ రాజకీయాల్లోకి రావడంతో అభిమానులు ఆనందంలో ఉన్నారు. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ ఎన్నికల్లో రజనీ ఖచ్చితంగా పోటీ చేసే అవకాశముంది.

ఆయనకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బట్టి చూస్తుంటే రజనీ సీఎం కావడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలిత లాంటి సినీ సెలబ్రెటీలు సీఎంలు అయ్యారు. అలాగే రజనీ కూడా సీఎం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.