సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదనే వార్త అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. గత కొద్దిరోజుల క్రితం రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో రజనీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆ ప్రకటన చేసిన కొద్దిరోజులకే అనారోగ్య పరిస్థితుల వల్ల రాజకీయాల్లోకి అడుగుపెట్టడం లేదంటూ రజనీ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు ఖంగుతిన్నారు. ఆయన ప్రకటనపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఒక అభిమాని రజనీ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. రజనీ ఇంటి ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందేనని డిమాండ్ చేశాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేసి ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు.
ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడి పేరు మురుగేషన్‌గా తెలుస్తోంది. రజనీకి అత్యంత వీరాభిమానిగా ఎప్పటినుంచో అతడు ఉన్నాడు. ఇంకా చాలామంది అభిమానులు రజనీ ఇంటి ముందుకు వచ్చి రాజకీయాల్లోకి రావాల్సిందేనని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. వారిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కావడం లేదు.